జాతీయంటాప్ స్టోరీస్

మార్కెట్ లో ఐఆర్ సీటీసీ షేరు జోరు.. రెండేళ్లలోనే రూ.640 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయలకు మార్కెట్ క్యాప్!

  • 20 రెట్లు పెరిగిన షేర్ విలువ
  • ప్రారంభంలో కేవలం రూ.320
  • ఇవాళ రూ.6,287 పలికిన ధర
  • లక్ష కోట్ల క్యాప్ కలిగిన ప్రభుత్వ సంస్థల జాబితాలో చేరిక

మార్కెట్ లో బుల్ రంకె వేస్తోంది. ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తోంది. కొన్ని కంపెనీలు ఊహించని రీతిలో లాభపడుతున్నాయి. అదే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) జోరు ప్రదర్శిస్తోంది. లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ కలిగిన సంస్థగా ఆవిర్భవించింది. మామూలుగా లక్ష కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ సంస్థలు కేవలం ఎనిమిదే ఉన్నాయి. ఇప్పుడు తొమ్మిదో సంస్థగా వాటి సరసన ఐఆర్ సీటీసీ చేరింది.

వాస్తవానికి 2019లో తొలిసారి సంస్థ స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వెళ్లినప్పుడు సంస్థ షేర్ ధర కేవలం రూ.315 నుంచి రూ.320 దాకానే ఉండేది. అప్పటికి సంస్థ మార్కెట్ క్యాప్ విలువ కేవలం రూ.640 కోట్లు. కానీ, రెండు నెలల్లో సంస్థ తలరాతే మారిపోయింది.

కరోనా సంక్షోభం తర్వాత రైల్వే కీలక నిర్ణయాలు తీసుకోవడం, సంస్కరణలు చేపట్టడం, ప్యాసింజర్ రైళ్లకు కోత పెట్టడం, రాయితీలను ఎత్తేయడం వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానికితోడు ప్రైవేట్ రైళ్లనూ పట్టాలెక్కించింది. వాటికితోడు ఆన్ లైన్ టికెటింగ్ పెరగడం, ఆతిథ్య రంగంలోకి వెళ్లడం వంటి సంస్కరణలతోనూ ఐఆర్ సీటీసీ షేర్లు దూసుకెళ్లాయి.

ఇవాళ ఒక్కో షేరు ధర రూ.6,287కి చేరింది. దాంతో మార్కెట్ క్యాప్ విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటింది. రెండేళ్ల కిందట వంద షేర్లు కొనుగోలు చేసి.. దీర్ఘకాలం అలాగే అట్టిపెట్టుకున్న వారికి భారీ లాభం కలిగింది. రెండేళ్లలోనే 20 రెట్ల మేర షేరు విలువ పెరిగింది. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ లోనూ లాభపడిన వాళ్లూ ఎక్కువే ఉన్నారు.

కాగా, ఇప్పటిదాకా లక్ష కోట్ల క్యాప్ కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్బీఐ, కోలిండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం, ఎస్బీఐ కార్డ్స్ మాత్రమే కావడం విశేషం. ఇప్పుడు వాటి సరసన ఐఆర్సీటీసీ కూడా చేరినట్టయింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close