తెలంగాణ

మే నెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు?

  • సెలవులు, జేఈఈ పరీక్షల నేపథ్యంలో మార్పు
  • ఎంపీసీ, బైపీసీకి ప్రాక్టికల్‌ పరీక్షలు తప్పనిసరి
  • 70% మార్కులకు సులభ రీతిన వార్షిక పరీక్షలు
  • 7 లేదా 9 ప్రశ్నల్లో మూడింటికి ఆన్సర్లు చాలు!

హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అకాడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్‌, రివిజన్‌ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని భావించినా, అదే మాసంలో అత్యధికంగా 10 రోజులు సెలవులుండటం, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్నందున వార్షిక పరీక్షల్లో 70% సిలబస్‌లోనే ఎక్కువ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇదివరకు ఐదు ప్రశ్నలిచ్చి మూడింటికి సమాధానాలు రాయాలని సూచించేవారు. ప్రస్తుతం 7 నుంచి 9 ప్రశ్నలిచ్చి మూడింటికి జవాబులు రాసే అవకాశం కల్పించబోతున్నారని సమాచారం. 

యథావిధిగా ప్రాక్టికల్‌ పరీక్షలు

ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో మినహాయించేది లేదని అధికారులు తెలిపారు. ఇంటర్నల్‌ పరీక్షలైన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

అకాడమిక్‌ క్యాలెండర్‌ పొడిగింపు

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మారనున్న నేపథ్యంలో అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా పొడిగించనున్నారు. ఇప్పటి వరకున్న అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 30తో ముగియాలి. కానీ పరీక్షలు ఎప్పుడు ముగిస్తే అప్పుడే అకడమిక్‌ క్యాలెండర్‌ ముగిసినట్టుగా పరిగణిస్తారు. ఇంటర్‌ పరీక్షలను మే నెలలో నిర్వహించే అవకాశం ఉండటంతో, అకడమిక్‌ క్యాలెండర్‌ను సైతం మే వరకు పొడిగించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్‌, రివిజన్‌ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఫస్టియర్‌ ఫెయిలైన వారికి పాస్‌ మార్కులు! ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ పాస్‌మార్కులు వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించాలని ఇంటర్‌బోర్డు అధికారులు యోచిస్తున్నారు. 2020లో నిర్వహించిన పరీక్షల్లో 1.92 లక్షల మంది ఫస్టియర్‌ విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. వీరికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో వీలుపడలేదు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇదే తరహాలో ఫస్టియర్‌ వారిని సైతం ఉత్తీర్ణులుగా ప్రకటించాలన్న డిమాండు ఉన్నది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఆమోదం రాగానే నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close