జాతీయంటాప్ స్టోరీస్

డిఫెన్స్​ అకాడమీలో అమ్మాయిలకూ అవకాశం.. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

  • సుప్రీంకోర్టుకు వెల్లడించిన అదనపు సొలిసిటర్ జనరల్
  • హర్షం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం
  • మార్గదర్శకాల రూపకల్పనకు గడువు కోరిన సర్కార్
  • ఈ నెల 20లోపు వెల్లడించాలని సూచించిన కోర్టు

కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో అమ్మాయిలకు కూడా అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ జరిగిన విచారణలో సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే, వారికి ప్రవేశాలు కల్పించేందుకుగానూ మార్గదర్శకాలను తయారు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరింది. దానికి సమ్మతించిన కోర్టు ఈ నెల 20లోపు వెల్లడించాలని ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ఎన్డీయేలోకి అమ్మాయిలను తీసుకునేందుకు సాయుధ బలగాలు ఒప్పుకోవడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక్కరోజులోనే సంస్కరణలన్నీ జరిగిపోవన్న విషయం తమకూ తెలుసని, అమ్మాయిలను ఎన్డీయేలోకి తీసుకునే ప్రక్రియ, చర్యలకు కేంద్రం కొంత సమయం తీసుకోవచ్చని సూచించింది.

దేశ రక్షణలో సాయుధ బలగాలు కీలకపాత్ర పోషిస్తాయని, అయితే, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బలగాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, ఎన్డీయేతో పాటు నేవల్ అకాడమీలో అమ్మాయిలకూ అవకాశం కల్పించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్డీయే పరీక్షను అమ్మాయిలూ రాయవచ్చని నెల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా అమ్మాయిలకు అవకాశం కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. దీనిపై అతి త్వరలోనే సవివరణాత్మకంగా అఫిడవిట్ ను దాఖలు చేస్తామన్నారు. ఎన్డీయే ప్రవేశ పరీక్షను నవంబర్ కు వాయిదా వేస్తున్నట్టు జూన్ 24న ప్రకటించామని, అయితే, ప్రస్తుతం అమ్మాయిలకు అవకాశం కల్పించే అంశంలో చాలా మార్పులు చేయాల్సి ఉన్నందున పరీక్షలపై యథాతథ స్థితిని అమలు చేయాల్సిందిగా కోరారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close