క్రీడలుటాప్ స్టోరీస్

చిన్నస్వామి స్టేడియంలో చిందేశారు

  • ఆసీస్‌తో మూడో వన్డేలో భారత్‌ జయభేరి
  • శతక్కొట్టిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ
  • కోహ్లీ, షమీ మెరుపులు
  • 2-1తో సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా

అచ్చొచ్చిన మైదానంలో రోహిత్‌ శర్మ శతక్కొడితే.. కోహ్లీ కళాత్మక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఫలితంగా ఆసీస్‌ విధించిన లక్ష్యం చిన్నస్వామిలో మరీ చిన్నదైపోయింది. కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి అన్న చందంగా హిట్‌మ్యాన్‌ సిక్సర్లతో విరుచుకుపడటంతో.. భారత్‌ అలవోక విజయం సాధించి సిరీస్‌ పట్టేసింది. గతేడాది బలహీన జట్టుతోనే భారత్‌ పర్యటనలో అదుర్స్‌ అనింపిచుకున్న కంగారూలు.. ఈసారి పూర్తి సామర్థ్యంతో బరిలో దిగినా వారి పప్పులు ఉడకలేదు. షమీ బెంబేలెత్తించే యార్కర్లతో విరుచుకుపడితే.. బుమ్రా బ్లాక్‌హోల్‌ బంతులతో కట్టిపడేశాడు. పాత కాపు స్టీవ్‌ స్మిత్‌ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌ ఆ మాత్రం స్కోరైనా చేస్తే.. ఛేదనలో భారత్‌ పరాక్రమం ముందు కంగారూ బౌలర్లు చిన్నబోయారు. ఆసీస్‌ను మట్టికరిపించిన కోహ్లీ సేన రెట్టించిన ఉత్సాహంతో కివీస్‌ టూర్‌కు బయల్దేరనుంది.

బెంగళూరు: పూర్తి సామర్థ్యంతో భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు టీమ్‌ఇండియా దీటైన జవాబిచ్చింది. అన్ని విభాగాల్లో తామే బెస్ట్‌ అని నిరూపిస్తూ కంగారూ జట్టుకు చెక్‌పెట్టింది. తొలి మ్యాచ్‌ ఓడి సిరీస్‌లో వెనుకబడ్డ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి ట్రోఫీ చేజిక్కించుకుంది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (128 బంతుల్లో 119; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొడితే.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (91 బంతుల్లో 89; 8 ఫోర్లు) మరో కళాత్మక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా.. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (132 బంతుల్లో 131; 14 ఫోర్లు, 1 సిక్స్‌) శతక్కొడితే.. లబుషేన్‌ (54) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో షమీ 4, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. రోహిత్‌, కోహ్లీ జోరు కనబర్చడంతో లక్ష్య ఛేదనలో భారత్‌ 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 289 పరుగులు చేసింది. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

రోహిత్‌, కోహ్లీ షో

Rohit

ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో శిఖర్‌ ధవన్‌ గాయపడటంతో లక్ష్యఛేదన కోసం రోహిత్‌, రాహుల్‌ జోడీ ఓపెనింగ్‌కు దిగింది. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రోహిత్‌.. తనదైన శైలిలో ఆరంభం నుంచి దూకుడు కనబరిస్తే.. రాహుల్‌ (19) ఆచితూచి ఆడాడు. రెండో ఓవర్‌ చివరి బంతికే స్టార్క్‌ బౌలింగ్‌లో బౌండ్రీతో బాదుడు ప్రారంభించిన రోహిత్‌ ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. నాలుగో ఓవర్లో ఓ ఫోర్‌, సిక్స్‌తో తన ఉద్దేశాన్ని చాటాడు. తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించాక అగర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. రోహిత్‌కు జతకలిశాడు. 15వ ఓవర్‌లో సింగిల్‌ తీసి 56 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్‌ ఆ తర్వాత టాప్‌గేర్‌ అందుకున్నాడు.

అయితే, కోహ్లీ కాసేపు జాగ్రత్తగా ఆడడంతో టీమ్‌ఇండియా స్కోరు 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. 26వ ఓవర్లో జంపా బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన రోహిత్‌.. 30వ ఓవర్లో సింగిల్‌ తీసి వన్డేల్లో 29వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 137 పరుగుల భాగస్వామ్యం పూర్తయ్యాక భారీ షాట్‌ ఆడబోయిన రోహిత్‌ లాంగాన్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి షాట్లతో అలరించాడు. కోహ్లీతో పోటీపడుతూ వరుస బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్‌ (8)తో కలిసి శ్రేయస్‌ పనిపూర్తి చేశాడు.

స్మిత్‌ ఒంటరిపోరు..

smith

టాస్‌ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే తడబడింది. ఈ క్రమంలో నాలుగో ఓవర్‌లోనే చక్కటి ఔట్‌ స్విగర్‌తో వార్నర్‌ (3)ను షమీ బోల్తా కొట్టించి ఆసీస్‌ను తొలి దెబ్బకొట్టాడు. కాసేటికే స్టీవ్‌ స్మిత్‌తో సమన్వయ లోపం కారణంగా కెప్టెన్‌ ఫించ్‌ రనౌట్‌ అవడంతో లబుషేన్‌ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ గత మ్యాచ్‌ను తలపిస్తూ చాపకింద నీరులా పరుగులు చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. సింగిల్స్‌, డబుల్స్‌తో పాటు చెత్తబంతులను బౌండ్రీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. సైనీ ఓవర్‌లో ఫోర్‌ కొట్టి స్మిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంటే.. లబుషేన్‌ సైతం జోరు పెంచి వన్డేల్లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు.

బ్రేకిచ్చిన జడేజా

ప్రమాదకరంగా మారిన స్మిత్‌-లుబుషేన్‌ జోడీని గత మ్యాచ్‌ లాగే భారత స్పిన్నర్‌ జడేజా విడదీశాడు. కోహ్లీ సూపర్‌ క్యాచ్‌తో లబుషేన్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. హిట్టింగ్‌ చేసేందుకు ఆసీస్‌ వ్యూహాత్మకంగా స్టార్క్‌ను పంపిస్తే అతడిని కూడాజడ్డూ రెండు బంతుల తర్వాత వెనక్కి పంపాడు. ఆ తర్వాత కారి (35) స్మిత్‌కు అండగా నిలిచాడు. ఈ జోడీ సాధికారికంగా ఆడడంతో 41 ఓవర్లు ముగిసే సరికి 228తో ఆసీస్‌ పటిష్ఠ స్థితిలో కనిపించింది. 44వ ఓవర్లో సింగిల్‌ తీసి స్మిత్‌ మరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కారిని కుల్‌దీప్‌ ఔట్‌ చేస్తే.. కాసేపటికే టర్నర్‌ (4)ను సైనీ పెవిలియన్‌కు పంపాడు. స్మిత్‌ ఓ ఎండ్‌లో దూకుడుగా ఆడి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి అయ్యర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత యార్కర్లతో విరుచుపడిన షమీ అదే ఓవర్లో కమిన్స్‌(0), ఆ తర్వాత జంపా(1)ను ఔట్‌ చేశాడు.

Team-India1

ధవన్‌కు గాయం

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌కు మరోసారి గాయమైంది. ఆరోన్‌ ఫించ్‌ కొట్టిన బంతిని ఆపేందుకు డైవ్‌ చేసిన గబ్బర్‌ భుజానికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత చేతికి కట్టుతో కనిపించగా.. బ్యాటింగ్‌కు సైతం దిగలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్‌ పర్యటనకు సోమవారం టీమ్‌ఇండియా బయల్దేరనుండగా.. ధవన్‌ వెళ్లడం అనుమానంగా ఉంది. శిఖర్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ తెలిపింది.

నాసిరకం ఆసీస్‌ జట్టుపై సిరీస్‌ నెగ్గామని ఇక ఎవరూ అనరు. ముంబైలో వాళ్లు విజృంభిస్తే.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మనవాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. పటిష్ఠ కంగారూలపై గెలువడం ఆనందంగా ఉంది. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు పడగొట్టడం కలిసొచ్చింది. కుర్రాళ్లు అదరగొట్టారు. రోహిత్‌, కోహ్లీ తమకలవాటైన రీతిలో చెలరేగితే.. అయ్యర్‌ ఆత్మవిశ్వాసంతో కూడిన ఇన్నింగ్స్‌ ఆడాడు.
– రవిశాస్త్రి

1. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయిని దాటిన కెప్టెన్‌గా కోహ్లీ (88 మ్యాచ్‌ల్లో) రికార్డుల్లోకెక్కాడు. ధోనీ (127), పాంటింగ్‌ (131) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

3. వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా రోహిత్‌ (217 ఇన్నింగ్స్‌లు) రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ (194), డివిలియర్స్‌ (208) అతడికంటే ముందున్నారు. భారత్‌ నుంచి ఈ మార్క్‌ చేరిన ఏడో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 3, ఫించ్‌ (రనౌట్‌) షమీ 19, స్మిత్‌ (సి) అయ్యర్‌ (బి) షమీ 131, లబుషేన్‌ (సి) కోహ్లీ (బి) జడేజా 54, స్టార్క్‌ (సి) (సబ్‌) చాహల్‌ (బి) జడేజా 0, కారీ (సి) అయ్యర్‌ (బి) కుల్దీప్‌ 35, టర్నర్‌ (సి) రాహుల్‌ (బి) సైనీ 4, అగర్‌ (నాటౌట్‌) 11, కమిన్స్‌ (బి) షమీ 0, జంపా (బి) షమీ 1, హజిల్‌వుడ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 27, మొత్తం: 50 ఓవర్లలో 286/9. వికెట్ల పతనం: 1-18, 2-46, 3-173, 4-173, 5-231, 6-238, 7-273, 8-276, 9-282, బౌలింగ్‌: బుమ్రా 10-0-38-0, షమీ 10-0-63-4, సైనీ 10-0-65-1, కుల్దీప్‌ 10-0-62-1, జడేజా 10-1-44-2.
భారత్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) జంపా 119, రాహుల్‌ (ఎల్బీ) అగర్‌ 19, కోహ్లీ (బి) హజిల్‌వుడ్‌ 89, అయ్యర్‌ (నాటౌట్‌) 44, పాండే (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 47.3 ఓవర్లలో 289/3. వికెట్ల పతనం: 1-69, 2-206, 3-274, బౌలింగ్‌: కమిన్స్‌ 7-0-64-0, స్టార్క్‌ 9-0-66-0, హజిల్‌వుడ్‌ 9.3-1-55-1, అగర్‌ 10-0-38-1, జంపా 10-0-44-1, లబుషేన్‌ 1-0-11-0, ఫించ్‌ 1-0-9-0.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close