జాతీయంటాప్ స్టోరీస్

టిక్‌టాక్‌పై నిషేధం

 • మరో 59 చైనా యాప్‌లపై కూడా.. కేంద్రం సంచలన నిర్ణయం
 • యూజర్ల సమాచారం చోరీ చేస్తున్న చైనా యాప్స్‌
 • అక్షరం కూడా వదలకుండా కాపీ చేస్తున్న టిక్‌టాక్‌
 • పాస్‌వర్డులు సహా ప్రతి డాటా చైనాకు చేరవేత
 • కుట్రను కనిపెట్టిన భారత నిఘా వర్గాలు
 • దేశ భద్రత, సార్వభౌమత్వానికి పెనుప్రమాదం
 • నిషేధంతో చైనా టెక్‌ కంపెనీలకు కోట్లలో నష్టం
 • గల్వాన్‌ ఘర్షణకు భారత్‌ ఆర్థిక ప్రతీకారం!
 • సమాచారం చోరీ ఫిర్యాదుల నేపథ్యంలో చర్య 
 • దేశ రక్షణ, భద్రతా చర్యల్లో భాగమేనని వెల్లడి

సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై భారత్‌ ఆర్థిక యుద్ధానికి తెరలేపింది. టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించింది. దేశభద్రత, సార్వభౌమత్వానికి ఈ యాప్స్‌ ప్రమాదకరంగా మారాయని సోమవారం ప్రకటించింది. యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్‌ దుర్వినియోగం చేస్తున్నాయని నిఘావర్గాలు తేల్చటంతో నిషేధం విధించినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సాంకేతిక సమాచార శాఖ తెలిపింది. ఈ యాప్స్‌ నిషేధంతో చైనా టెక్‌ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని టెలికం నిపుణులు చెప్తున్నారు. 

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ ‘డిజిటల్‌’ షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన యాప్‌లపై కొరడా ఝళిపించింది. చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తున్నట్టు సోమవారం కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌, వీచాట్‌, హలో, షేర్‌ఇట్‌, యూసీ బ్రౌజర్‌ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. సమాచార సాంకేతికత నిబంధనలు 2009, సమాచార సాంకేతికత చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దేశ రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు వివరించింది. ‘ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ప్లాట్‌ఫాంలలోని కొన్ని యాప్స్‌ వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. విదేశాల నుంచి నడుస్తున్న కొన్ని సర్వర్లకు అనధికారికంగా ఆ సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నాయి’ అని కేంద్రం వెల్లడించింది. చైనా యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతున్నదని, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతున్నదని గతకొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నట్టు, ఇదే అంశంపై పలువురు తమకు ఫిర్యాదులు చేసినట్టు చెప్పింది. వినియోగదారుల సమాచార భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 53 యాప్‌లను వెంటనే నిషేధించాలని గతవారం నిఘావర్గాలు కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తెలిసిందే.

చైనాకు డిజిటల్‌ షాక్‌ ఇచ్చిన భారత్‌ 

 • నిషేధిత యాప్‌ల జాబితా ఇదే 

టిక్‌టాక్‌, షేర్‌చాట్‌, క్వాయి, యూసీ బ్రౌజర్‌, బైయిదూ మ్యాప్‌, షెయిన్‌, క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌, డీయూ బ్యాటరీ సేవర్‌, హలో, లైకీ, యూక్యామ్‌ మేకప్‌, మీ కమ్యూనిటీ, సీఎమ్‌ బ్రౌజర్స్‌, వైరస్‌ క్లీనర్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, రామ్‌వీ, క్లబ్‌ ఫ్యాక్టరీ, న్యూస్‌డాగ్‌, బ్యూటీప్లస్‌, వీచాట్‌, యూసీ న్యూస్‌, క్యూక్యూ మెయిల్‌, వీబో, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, బిగో లైవ్‌, సెల్ఫీసిటీ, మెయిల్‌ మాస్టర్‌, ప్యారెలాల్‌ స్పేస్‌, మీ వీడియో కాల్‌, వీ సింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, వైవా వీడియో, మెయితూ, విగో వీడియో, న్యూ వీడియో స్టేటస్‌ డీయూ రికార్డర్‌, వాల్ట్‌ హైడ్‌, క్యాష్‌ క్లీనర్‌, డీయూ క్లీనర్‌, డీయూ బ్రౌజర్‌, హగో ప్లే, క్యామ్‌ స్క్యానర్‌, క్లీన్‌ మాస్టర్‌ (ఛీతా మొబైల్‌), వండర్‌ కెమెరా, ఫొటో వండర్‌, క్యూక్యూ ప్లేయర్‌, వీ మీట్‌, స్వీట్‌ సెల్ఫీ, బైయిదూ ట్రాన్స్‌లేట్‌, వీమేట్‌, క్యూక్యూ  ఇంటర్నేషనల్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంఛర్‌, యూ వీడియో, వీ ఫ్లై స్టేటస్‌ వీడియో, మొబైల్‌ లెజెండ్స్‌, డీయూ ప్రైవసీ.

యాప్స్‌ను ఎలా బ్యాన్‌ చేస్తారు?

ఒక దేశంలో యాప్స్‌ను నిషేధించటం రెండుమూడు రకాలుగా ఉంటుంది. ప్రభుత్వమే నేరుగా బ్యాన్‌ చేయటం. రెండోది మొబైల్‌ యాప్స్‌ను అందించే గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి నిషేధించిన యాప్స్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరటం. ఇందుకోసం ప్రభుత్వాలు చట్టాల ద్వారా కంపెనీలకు ఆదేశాలివ్వాల్సి ఉంటుంది. మూడోది మొబైల్‌ తయారీ కంపెనీలు, టెలికం ప్రొవైడర్లను నిషేధిత యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వరాదని ఆదేశించటం. ప్రస్తుతం ప్రభుత్వం నిషేధించిన యాప్స్‌లో చాలావరకు థర్డ్‌పార్టీ యాప్‌లే.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close