జాతీయంస్పెషల్

మెట్రో ఆల్‌టైమ్‌ రికార్డు

  • మూడు కారిడార్లలో ఒక్కరోజే 4.47 లక్షల మంది ప్రయాణం
  • జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మార్గంలో 34 వేలమంది
  • క్యూఆర్‌ కోడ్‌ టికెట్లకు పెరుగుతున్న క్రేజ్‌

హైదరాబాద్‌ మెట్రోరైలు ఆల్‌టైమ్‌ రికార్డు నమోదుచేసింది. సోమవారం మూడు కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సాధారణ రోజులను పరిగణనలోకి తీసుకొంటే ఇదే అతిపెద్ద రికార్డని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2019 డిసెంబర్‌ 31 ఉదయం నుంచి 2020 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు 4.60 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో రాకపోకలు సాగించిన్నప్పటికీ  సాధారణ రోజుల్లో ఈ  సంఖ్య 4.47లక్షలకు చేరుకోవడం ఇదే మొదటిసారి. మెట్రోలో రోజుకు సగటున 4.10 నుంచి 4.20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. గత రెండేండ్లలో మెట్రోలో ప్రయాణించినవారి సంఖ్య ఇప్పటికే  పది కోట్లు దాటింది. 

జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మార్గంలో 34వేల మంది ప్రయాణం

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌  చేతుల మీదుగా ప్రారంభించిన జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మెట్రో రైలు మార్గంలో సోమవారం ఒక్కరోజే 33,886 మంది ప్రయాణించినట్టు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇందులో ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి 14,894 మంది ప్రయాణించినట్టు చెప్పారు. ఈ మార్గంలో ప్రయాణించేవారి సంఖ్య నెలరోజుల్లో పెరిగే అవకాశం ఉన్నదన్నారు. క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు కొనుగోలుచేస్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నదని, ఇది సోమవారం ఒక్కరోజే 47వేలకు చేరిందని వెల్లడించారు. అధిక రద్దీ విషయంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ 25,779 మంది ప్రయాణికులతో అగ్రస్థానంలో, ఎల్బీనగర్‌ 24,181 మందితో రెండో స్థానంలో నిలిచాయి. రాయదుర్గం 21,957, మియాపూర్‌ 19,425, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు స్టేషన్‌ 16,677, హైటెక్‌సిటీ 13,568, జేఎన్టీయూహెచ్‌ 13,513, ఉప్పల్‌ 13,913, సికింద్రాబాద్‌ 15,294, జేబీఎస్‌ 14,894 మందితో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close