రాజకీయం

కాంగ్రెసోళ్లు ఓట్లెలా అడుగుతారు?

  •  ఉత్తమ్‌వి కాయకొరుకుడు మాటలు
  •  మీ హయాంలో ఒక్క మంచి పని చేశారా?
  •  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  •  టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ తొగుట అధ్యక్షుడు 

సిద్దిపేట : ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు?.. రైతులకు కరెంట్‌ ఇవ్వక మోసం చేసినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకా?.. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చినందుకా?.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూపాయి ఇవ్వనందుకా?’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి?.. మీ మాటలు కాయకొరుకుడు మాటలు.. మీ నాయకులకు మీ మీదే విశ్వాసం లేదు.. ఇక ప్రజలకు విశ్వాసం ఎలా ఉంటుంది’ అని అన్నారు. దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలమైన సిద్దిపేట జిల్లా తొగుట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్‌తోపాటు 100 మంది కాంగ్రెస్‌, బీజేపీల నుంచి మంగళవారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికలో తొగుట మండలం అద్భుత మెజార్టీ ఇస్తుందన్న సంపూర్ణ విశ్వాసం ఉన్నదన్నారు. టీఆర్‌ఎస్‌కు విశ్వాసం, విశ్వసనీయత ఉన్నదని చెప్పారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి కాంగ్రెస్‌ వాళ్లు కేసులు వేయడమే కారణమని ఆరోపించారు. కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌ భూనిర్వాసితులకు పరిహారం ఎలా అందిందో మల్లన్నసాగర్‌ బాధితులకు కూడా అదేవిధంగా ఇస్తామన్నారు. దుబ్బాకను సోలిపేట రామలింగారెడ్డి అన్నివిధాలా అభివృద్ధి చేశారన్నారు. రూ.800 కోట్లు వెచ్చించి మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చామనీ, రూ.101 కోట్లతో నాణ్యమైన కరెంట్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అప్పుల బాధ తో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదనీ.. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు ఏ రకంగా చనిపోయినా రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నదన్నారు. హుజూర్‌నగర్‌లో ఓట్ల కోసం అక్కడికి కేసీఆర్‌ పోకున్నా.. టీఆర్‌ఎస్‌ గెలిచాక రూ.300 కోట్ల అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలిచిందనీ, దుబ్బాక కూడా అంతకు డబుల్‌ మెజార్టీతో గెలుస్తుందన్నారు. తొగుట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని, సోలిపేట సుజాతక్కను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

గోబెల్‌ ప్రచారాన్ని తిప్పికొడుదాం..

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌ అని.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌, బీజేపీ గోబెల్‌ ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా సోషల్‌ మీడియా ఇంచార్జీలు పని చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. అసత్య ప్రచారాలతో జరగని దానిని జరిగినట్లు చెబుతూ కాంగ్రెస్‌, బీజేపీ గోబెల్‌ ప్రచారాన్ని చేస్తున్నాయని విమర్శించారు. బీడీ కార్మికులకు ఇస్తున్న రూ.2 వేల పింఛన్‌లో రూ.1600 మోదీ ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అసలు బీడీల పింఛన్‌ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 

మంత్రి హరీశ్‌రావు వాహనం తనిఖీ

తొగుట: ప్రచారంలో భాగంగా తొగుటకు వస్తున్న మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని మండలంలోని వాగ్గడ్డ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. వాహనాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో హరీశ్‌రావు పోలీసులకు సహకరించారు.

మీ ఆడబిడ్డను.. ఆశీర్వదించండి..  ఓటర్లకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత విజ్ఞప్తి

రాయపోల్‌: సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు మీ ఆడబిడ్డను గెలిపించండని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం ఎల్కల్‌, బేగంపేట, వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లి, వీరనగర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close