జాతీయంటాప్ స్టోరీస్

ముంచెత్తుతున్న వానలు.. జల దిగ్బంధంలోనే చెన్నై

చెన్నై : తమిళనాడులో వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని చెన్నై సహా 26 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి చెన్నై, సమీప జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిశాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌లో భారీ వర్షాపాతం నమోదైంది. వానలకు చెన్నై శివారు ప్రాంతాలు నీటితో నిండిపోగా.. నగరంలోని ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని మూడు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది.

కొళత్తూర్‌, పెరవళ్లూర్‌, కేకేనగర్‌ ఇండ్లలోకి నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్‌ సరఫరా లేక బయటకు రాక.. ఇండ్లలో ఉండలేక అష్టకష్టాలు పడుతున్నారు. చాలాచోట్ల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మోటార్లతో నీటిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. తిరువళ్లూర్‌, చెంగల్‌పట్టు, మధురైలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. సహాయక చర్యల్లో నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి.

ఇదిలా ఉండగా.. మరో రెండు రోజులు తమిళనాడులో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెన్నై, సమీప జిల్లాల్లో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురంలో పాఠశాలలు, కళాశాలలకు, తిరువళ్లూర్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close