తెలంగాణ

తెప్పలతో కుండపోత

  • 18 జిల్లాలను ముంచెత్తిన వాన
  • 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడొచ్చు!
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పలుచోట్ల 10-19 సెం.మీ.లు
  • చౌటుప్పల్‌లో 19.7 సెంటీమీటర్లు
  • బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి
  • నేడు, రేపు భారీనుంచి అతిభారీ వర్షం
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి
  • పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు

హైదరాబాద్‌ : ఓ చోట భారీ వర్షం.. ముందుకెళ్తే కమ్మేసిన మబ్బులే.. ఇంకోచోట కుండపోతతో రోడ్లు, కాలనీలే జలమయం.. మరోచోట చిరుజల్లులే.. ఇలా తెప్పలున్న దగ్గర వాన దంచి కొడుతున్నది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దాదాపు 18 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. పలుచోట్ల 10 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల కేంద్రంలో 19.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తం గా వర్షం దంచికొట్టింది. గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టుతోపాటు 625 చెరువులు నిండుకుండల్లా మారాయి. పాలమూరు జిల్లాను వర్షం కుమ్మేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పారింది. రామయ్యబౌళి, శివశక్తినగర్‌, బీకేరెడ్డి కాలనీ, క్రిస్టియన్‌పల్లి, వన్‌టౌన్‌, న్యూటౌన్‌, లక్ష్మీనగర్‌కాలనీ, శ్రీనివాస్‌ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. స్థానికుల సమాచారంతో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెల్లవారుజామున 3.50 గంటలకు బైక్‌పై ముంపు ప్రాంతాలకు వెళ్లారు. పలు కాలనీల్లో పర్యటించారు. యాదాద్రి భవనగిరి జిల్లాలోని 17 మండలాల్లో భారీ వర్షం కురిసింది. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గాంధీపార్కు, రాంనగర్‌, విద్యానగర్‌ తదితర కాలనీలు జలమయమయ్యాయి. చిన్నకొండూరు చౌరస్తా , బస్టాండ్‌ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి కామారెడ్డి-మెదక్‌ సరిహద్దుల్లోని పోచారం డ్యాం పొంగిపొర్లుతున్నది. మెదక్‌ శివారులోని పసుపులేరు వాగు, సిద్దిపేట జిల్లాలోని మోయెతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జహీరాబాద్‌ డివిజన్‌లో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, మేడ్చల్‌-మల్కాజిగిరి, వనపర్తి, జగిత్యాల, కరీంనగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఉపరితల ఆవర్తనాలు.. రుతుపవన ద్రోణి
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. రుతుపవనాల ద్రోణి హరియానాలోని హిస్సార్‌ నుంచి ఢిల్లీ, సిధి, బాలంగీర్‌, కళింగపట్నం మీదుగా తూర్పు- ఆగ్నేయ దిశగా బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నదని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ఉత్తర-తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు తిరిగి ఉన్నదని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర పరిసర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. దీనికి తోడుగా షియర్‌ జోన్‌ కొనసాగుతున్నదని తెలిపారు. రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీనుంచి అతి భారీవర్షాలు, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో, రెడ్‌ హెచ్చరికలు జారీచేసింది. సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు అతిభారీ వర్షాలు పడుతాయని పేర్కొన్నది. ఈ మేరకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీచేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేసింది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్‌, పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలో అత్యధికంగా
ప్రాంతం వర్షం (సెంటీమీటర్లు)
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ 19.7
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట 17
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి 15
మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ సర్ధాన 14
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ 14
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట,
కొండపాక, తిమ్మారెడ్డిపల్లె 11
కరీంనగర్‌ జిల్లా గంగాధర 11
వికారాబాద్‌ జిల్లా ముజాహిద్‌పూర్‌ 11
మహబూబ్‌నగర్‌ పట్టణం 11
హైదరాబాద్‌ జిల్లా సైదాబాద్‌ 11

ఎల్లంపల్లికి 85 వేల క్యూసెక్కులు
రాష్ట్రంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎల్లంపల్లికి 85 వేల క్యూసెక్కులు, ఎస్సారెస్పీకి 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బరాజ్‌లో 23 గేట్లను తెరిచారు. 84,866 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లో వస్తుండగా, 51,750 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు. కృష్ణా నది ప్రాజెక్టుల్లోనూ స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. జూరాలకు 21 వేల క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 38 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఆయా ప్రాజెక్టుల నుంచి అంతేస్థాయిలో నీటిని వదులుతున్నారు.

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం అయ్యవారిపల్లికి చెందిన కృష్ణయ్య, యశోద దంపతుల ఒక్కగానొక్క కుమారుడు శివప్రసాద్‌ (23) ఆదివారం కటుంబసభ్యులతో కలిసి గ్రామ శివారులోని దుందుభీ వాగులో ఉన్న చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడి మృతిచెందాడు. చెక్‌డ్యాంకు కిలోమీటర్‌ దూరంలో మృతదేహం లభ్యమైంది. మరోవైపు, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మామిడివాగులో ద్విచక్రవాహన చోదకుడు గల్లంతయ్యాడు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close