రాజకీయం

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అంశంపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

  • గవర్నర్ కోటాలో కౌశిక్ కు ఎమ్మెల్సీ ఆఫర్ చేసిన కేసీఆర్
  • ఫైల్ ను పెండింగ్ లో పెట్టిన గవర్నర్ తమిళిసై
  • ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందన్న గవర్నర్

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయారు. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. ఈ మేరకు ఫైల్ ను గవర్నర్ తమిళిసైకి పంపించారు.

అయితే ఇంత వరకు రాజ్ భవన్ నుంచి ఈ అంశంపై ఎలాంటి స్పందన రాలేదు. ఇది టీఆర్ఎస్ శిబిరంలో టెన్షన్ పుట్టిస్తోంది. ఆ ఫైల్ ను తమిళిసై హోల్డ్ లో పెట్టారు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై ఈరోజు స్పందించారు.

రాజ్ భవన్ లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ… కౌశిక్ ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వం తమకు పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందని… ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

ఆగస్ట్ 1న జరిగిన కేబినెట్ సమావేశంలో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ తీర్మానం చేశారు. వెనువెంటనే దీనికి సంబంధించిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపించారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫైల్ ను గవర్నర్ పెండింగ్ లోనే ఉంచారు.

మరోవైపు, ప్రజాకవిగా పేరుగాంచిన గోరటి వెంకన్నను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ గతంలో పంపిన ఫైల్ ను… తమిళిసై ఒక్క రోజు వ్యవధిలోనే ఆమోదించారు. కౌశిక్ విషయంలో మాత్రం ఆమె సమయం తీసుకుంటున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close