తెలంగాణ

నీటి మీటర్ల ఏర్పాటుకు ఏప్రిల్‌ వరకు గడువు

హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉచిత తాగునీటి సరఫరా పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికి ప్రపంచ జలదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జలదినోత్సవం రోజున ఉచిత తాగునీటిపై చర్చ జరగడం సంతోషకరమని మంత్రి అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకం కోసం ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
గతంలో హైదరాబాద్‌లో నీటికోసం కుండలు, బిందెలతో ప్రదర్శనలు జరిగేవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో అలాంటి ప్రదర్శనలు లేవని చెప్పారు. 2050 వరకు నీటి సమస్య రాకుండా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దీనికోసం రూ.4700 కోట్లతో కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తామని వెల్లడించారు. రూ.14500 కోట్లతో సుంకిశాల నుంచి కృష్ణా జలాలను తరలిస్తున్నామని తెలిపారు. ఉచిత తాగునీటికి రూ.500 కోట్లు ఖర్చవుతుందని, అందుకే ఆధార్‌ అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. నీటి మీటర్లు పెట్టుకోవడానికి ఏప్రిల్‌ చివరి వరకు గడువు పెంచుతున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలోని మురికి వాడలన్నింటికీ ఉచితంగా తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగాయని తెలిపారు. ప్రతి ఇంటికి నీటి సంరక్షణ పిట్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close