రాజకీయం

ప్రతిష్టాత్మకంగా ‘పట్టభద్రుల’ నమోదు

  • ఓటర్ల జాబితాపై మంత్రి కేటీఆర్‌ పిలుపు  
  • ‘వరంగల్, ఖమ్మం, నల్లగొండ’టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీలతో టెలి కాన్ఫరెన్స్‌ 

హైదరాబాద్‌: శాసనసభ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ‘వరంగల్‌ – ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలతో గురువారం కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల ఓటరు నమోదులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అర్హతను బట్టి తమ ఇంటి నుంచే నమోదు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, ఇందులో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. తాజా ఓటరు లిస్టు ఆధారంగానే గ్రాడ్యుయేట్స్‌ కోటా ఎన్నికలు జరుగుతాయని, ఇప్పటికే గ్రామస్థాయి నుంచి ఇన్‌చార్జీలు ఓటర్ల నమోదుకు సన్నాహాలు ప్రారంభించారని కేటీఆర్‌ వెల్లడించారు. 

ప్రతిపక్ష పార్టీలు దివాలా..  
రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు దివాలా తీశాయని కేటీఆర్‌ అన్నారు. దీంతో విపక్షాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిందన్నారు. త్వరలోనే టీహబ్, టాస్క్‌ కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు, అక్టోబర్‌లో ఖమ్మం జిల్లాలో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close