తెలంగాణ

తెలంగాణలో వ‌ర్ష బీభ‌త్సం.. సిరిసిల్ల జ‌ల‌మ‌యం

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తోంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ప‌లు ప‌ట్ట‌ణాలు, కాల‌నీలు, గ్రామాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్ల‌డంతో ర‌హ‌దారులు తెగిపోయాయి. దీంతో ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల అయితే ఇండ్ల‌లోకి వ‌ర్ష‌పు నీరు వ‌చ్చి చేర‌డంతో.. బియ్యంతో స‌హా ఇత‌ర వ‌స్తువులు పూర్తిగా త‌డిసిపోయాయి.

సిరిసిల్ల జ‌ల‌మ‌యం

సిరిసిల్ల‌లో భారీ వ‌ర్షం కురిసింది. ప‌ట్ట‌ణానికి వ‌ర‌ద పోటెత్తింది. భారీ వ‌ర‌ద‌తో సిరిసిల్ల‌లో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. సిరిసిల్ల‌లోని ప‌లు కాల‌నీలో వ‌ర‌ద నీరు చేర‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మోకాళ్ల లోతుకు పైగానే వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. కొన్ని కాల‌నీల్లో కార్లు కూడా వ‌ర‌ద ప్ర‌వాహ‌నికి కొట్టుకుపోయాయి. పాత‌బ‌స్టాండ్‌, ప్ర‌గ‌తి న‌గ‌ర్‌, సాయిన‌గ‌ర్, వెంకంపేట‌, శాంతి న‌గ‌ర్‌, ప‌ద్మాన‌గ‌ర్‌ ఏరియాల్లో ఇండ్ల‌లోకి వ‌ర్ష‌పు నీరు చేరింది. అంబికాన‌గ‌ర్‌, శాంతి న‌గ‌ర్‌, గాంధీన‌గ‌ర్‌లో వ‌ర‌ద పోటెత్తింది. పెద్ద బ‌జార్‌, అంబేద్క‌ర్ న‌గ‌ర్ ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర‌ద నీరు ఉధృతంగా ప్ర‌వహిస్తుండ‌టంతో ఆయా కాల‌నీల వాసులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. కొత్త క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణాన్ని వ‌ర‌ద‌నీరు ముంచెత్తింది. ఉద‌యం నుంచి ఒక్క‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

సిరిసిల్ల పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో సిరిసిల్ల‌లోని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. 24 గంట‌లూ అందుబాటులో ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం కంట్రోల్ రూమ్ నెంబర్ 9100069040 ఏర్పాటు చేశారు. కావున ఎలాంటి సహాయం కావలసి ఉన్న ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయొచ్చు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close