తెలంగాణ

జలదారుల్లో మీన రాశులు

  • రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న మత్స్య సంపద
  • 260 కోట్ల పిల్లలతో 13.90 లక్షల టన్నుల ఉత్పత్తి
  • 208 కోట్ల పెట్టుబడితో 11,500 కోట్ల సంపద
  • కాళేశ్వరం, మిషన్‌కాకతీయతో మారిన మత్స్యరంగం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెరిగిన నీటి వనరులతో ఒకవైపు ధాన్యం రాశులు.. మరోవైపు మీన రాశులు గుట్టగుట్టలుగా పెరిగిపోతున్నాయి. వరి దిగుబడి లక్షల నుంచి కోట్ల టన్నులకు చేరుకుంటుంటే.. చేపల ఉత్పత్తి వేలుదాటి లక్షల టన్నుల్లోకి దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీద్వారా ఐదేండ్లలో రూ. 208 కోట్ల పెట్టుబడితో రూ.11,500 కోట్ల సంపదను సృష్టించింది. 260 కోట్ల పిల్లల పంపిణీతో 13.90 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేసింది. దీనికి రొయ్యల ద్వారా వచ్చిన సుమారు రూ.వెయ్యి కోట్ల సంపద అదనం. చేపలతో ఏటా వందల కోట్ల ఆదాయం సృష్టిస్తూ.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలి ఏడాదినుంచే అద్భుతమైన ఫలితాలు అందుతున్నాయి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఐదేండ్లలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో రూ.208 కోట్ల ఖర్చుతో సుమారు 260 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. వీటిద్వారా 13.90 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా.. ఉత్పత్తి అయిన చేపలకు మార్కెటింగ్‌ సౌకర్యం కూడా కల్పించారు. ఇందుకోసం మత్స్యకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను, ఆటోలను అందించారు. ఒకప్పుడు కూలీనాలీకి వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు స్వతంత్య్రంగా వారి వృత్తి చేసుకుంటూ దర్జాగా బతుకుతున్నారు.

దశ మార్చిన కాళేశ్వరం, మిషన్‌కాకతీయ
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ రాష్ట్రంలో మత్స్యరంగం రూపురేఖలను మార్చివేశాయి. మిషన్‌ కాకతీయతో చెరువులు, కుంటల్లో జల సవ్వడి మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన ఏడాదంతా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా రెండేండ్లుగా రాష్ట్రంలో ఎండిన చెరువనేదే లేకపోవడం గమనార్హం. కుంటలు, చెక్‌డ్యాంలు, ఇతర చిన్ననీటి వనరులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకం అద్భుతంగా విజయం సాధించడమే కాకుండా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో బావుల దారుల్లో మావులు పెట్టి చేపల కోసం ఎదురుచూసిన మత్సకారులు ఇప్పడు మోటర్‌బోట్లు వేసుకుని వలలతో పట్టుకుంటున్నారు.

రేపటినుంచి చేపపిల్లల పంపిణీ
రంగనాయకసాగర్‌ వద్ద ప్రారంభించనున్న మంత్రులు తలసాని, హరీశ్‌రావు
కాళేశ్వరం జలాలు ఓవైపు, విస్తారమైన వర్షాలు మరోవైపు.. వెరసి రాష్ట్రంలో జలాశయాలు, చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. వీటిల్లో చేప పిల్లలు సవ్వడి చేయనున్నాయి. రాష్ట్రంలో బుధవారం నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ మొదలుకానున్నది. సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయకసాగర్‌, కోమటిచెరువులో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావు చేపపిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదేసమయంలో అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేపపిల్లల విడుదల కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది 30 వేల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఇతర నీటి వనరుల్లో 93 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నది. మరో రూ. 25 కోట్ల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నారు. గతేడాది 18,335 నీటి వనరుల్లో రూ.51.80 కోట్ల వ్యయంతో 68.52 కోట్ల చేప పిల్లలను, రూ. 8.61 కోట్ల వ్యయంతో 4 కోట్ల రొయ్య పిల్లలను విడుదలచేసింది.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్రంలో మత్స్యరంగానికి సీఎం కేసీఆర్‌ ఊపిరిపోశారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. నేడు గ్రామాల్లో మత్స్యకారులు స్వతంత్య్రంగా జీవించగలుగుతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.12వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టించడం ఎంతో గొప్ప విషయం. మత్స్యకారులకు, రాష్ర్టానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్న ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.

  • తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మత్స్యశాఖ మంత్రి
Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close