టాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్

రైతులు వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌

తెలంగాణలో గోదావరి నదిపై ప్రస్తుతానికి ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు శ్రీరాంసాగర్ విషయంలో ప్రభుత్వానికి, రైతులకు మధ్య యుద్ధం ముదురుతోంది. ప్రాజెక్టు కాకతీయ కాల్వ ద్వారా లీకేజీ నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు, మంత్రి హరీశ్‌రావు చేసిన ప్రకటనపై మండిపడుతున్నారు. కాల్వ ద్వారా నీటి విడుదల సాధ్యం కాదని చెప్పడంతో ఆందోళనను ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టును ముట్టడించి నీటిని విడుదల చేసుకునేందుకూ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో, నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలో గల శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు వద్ద పోలీసు భద్రతను పెంచారు. రైతులు మళ్లీ ఆందోళన చేయకుండా ప్రాజెక్టు కార్యాలయం వద్దకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండు వేల మంది వరకు పోలీసులు గత వారం రోజులుగా బందోబస్తులో పాల్గొంటున్నారు.

44వ నంబర్‌ జాతీయ రహదారి నుంచి ప్రాజెక్టు కాలనీలోకి వెళ్లాలన్నా తనిఖీలు చేసి గుర్తింపు కార్డులున్న వారినే అనుమతిస్తున్నారు. డ్యామ్‌పైన, ప్రాజెక్టు కార్యాలయం వద్ద, ప్రాజెక్టు కూడలి వద్ద బందోబస్తులు కొనసాగుతున్నాయి. దూద్‌గాం శివార్లలో జాతీయ రహదారిపై బందోబస్తు ఏర్పాటు చేయగా, గ్రామాల నుంచి రైతులు ఆందోళన చేయడానికి శ్రీరాంసాగర్‌ప్రాజెక్టుకు రాకుండా గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

రైతులు శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి కాకతీయ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మొదట ఈనెల 3 నుంచి 7 వరకు ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. ప్రస్తుతం 144 సెక్షన్‌ను ఈనెల 10 వరకు పొడిగిస్తూ నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయతో పాటు పలు జిల్లాల ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా కాకతీయ కాలువకు సాగునీటిని అందించే విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం తగదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నవీపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో సాగు నీరందించాలని ఆందోళన చేట్టిన సాగర్‌ ఆయకట్టు రైతులపై సర్కారు కక్ష సాధింపుగా కేసులు నమోదు చేయడం శోచనీయమన్నారు. ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరున్నా అర టీఎంసీ విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాగునీటి కంటే సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్‌ భగీరథ గొప్పలు చెప్పుకోవడానికే నీటిని విడుదల చేయడంలేదని ఆరోపించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close