జాతీయంటాప్ స్టోరీస్

‘గోలీ మారో’ కొంపముంచింది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎదురైన భారీ పరాభవంపై ఆయన గురువారం స్పందించారు.
  • పార్టీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు నష్టం కలిగించాయి
  • అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై అమిత్‌షా
  • నన్ను చాణక్యునితో పోల్చవద్దు
  • ఢిల్లీ ఫలితాల విషయంలో నా అంచనా తప్పింది
  • ప్రజలు బీజేపీని తిరస్కరించలేదు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎదురైన భారీ పరాభవంపై ఆయన గురువారం స్పందించారు. ‘గోలీ మారో (కాల్చి పారేయండి)’, ‘ఇది ఇండో-పాకిస్థాన్‌ మ్యాచ్‌’ వంటి విద్వేష వ్యాఖ్యలు తమ పార్టీ నేతలు చేసి ఉండాల్సింది కాదని.. ఆ ప్రసంగాలే తమకు నష్టం చేసి ఉంటాయని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపోటముల కోసం బీజేపీ పోటీ చేయదని, తమ భావజాలాన్ని విస్తరించాలన్న లక్ష్యంతోనే తాము ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పారు. ‘టైమ్స్‌ నౌ’ మీడియా సంస్థ గురువారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ నేతలు కొందరు చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యల వల్లే బీజేపీ ఓడిపోయిందని అంగీకరించారు. ఢిల్లీ ఎన్నికల విషయంలో తన అంచనా తప్పిందని, అయితే ప్రజలిచ్చిన తీర్పును పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కి వ్యతిరేకమైనదిగా భావించలేమని చెప్పారు. 

‘ఢిల్లీలో 45 సీట్లు గెలుస్తామన్న నా ట్వీట్‌కు ఎన్నికల ఫలితాలకు పొంతన లేదు. అది కేవలం నా అంచనా మాత్రమే.. అంచనాలు కొన్నిసార్లు తప్పుతుంటాయి. మేము ఓడిపోయినంత మాత్రాన ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించినట్టు కాదు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో  ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మూడోస్థానంలో నిలిచింది. అంటే అప్పుడు ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను తిరస్కరించినట్టు కాదు కదా? ఎన్నికల ఫలితాలు సిద్ధాంతాలకు ప్రతిబింబం కాదు. ఢిల్లీ ఎన్నికల్లో మేము కేవలం ఒక్క అంశంపై పోరాడలేదు. ప్రచారం సందర్భంగా షాహీన్‌బాగ్‌ నిరసనలను ఒక అంశంగా ప్రస్తావించాం.. ఆ సమస్య ఇంకా కొనసాగుతున్నది. ఈవీఎంలో కమలం గుర్తుపై గట్టిగా నొక్కండి.. ఆ కరంటు షాక్‌ షాహీన్‌బాగ్‌లోని వారికి తగలాలి అన్న నా వ్యాఖ్య కేవలం ప్రజలు ఆ సమస్యను అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో చేసినదే’ అని అమిత్‌షా చెప్పారు.

సీఏఏతో నాకు వ్యక్తిగత ప్రయోజనం లేదు

‘ఇక సీఏఏతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం లేదు. దేశానికి ఏది మంచిదైతే నేను అది చేస్తాను. సీఏఏ గురించి ఎవరైనా వచ్చి నాతో చర్చించవచ్చు. నా కార్యాలయానికి వచ్చి  సమయం కోరితే మూడు రోజుల్లోనే వారిని కలుస్తాను. జర్నలిస్టులు కేవలం సీఏఏ వ్యతిరేక నిరసనల గురించి మాత్రమే మాట్లాడకూడదు..అసలు ప్రజలెందుకు ఆందోళన చేస్తున్నారో రాయాలి. బీజేపీ ముస్లింల వ్యతిరేక పార్టీ కాదు. మాకు ఎవరి సర్టిఫికెట్‌ అవసరం లేదు. మతం ఆధారంగా మేము ఎవరి విషయంలోనూ వివక్ష చూపలేదు. దేశ ప్రజలకు మరోసారి స్పష్టం చేస్తున్నాను.. సీఏఏలో ముస్లింల వ్యతిరేక నిబంధనలేవీ లేవు. ఎన్నార్సీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఇటీవలే పార్లమెంట్‌లో స్పష్టం చేశాను. నా వ్యాఖ్యలను వక్రీకరించకండి. (ఎన్నార్సీపై) నిర్ణయం తీసుకుంటే మీకు (మీడియా) తప్పకుండా చెప్తాం. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీ విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పౌరసత్వాన్ని రుజువు చేసుకొనేందుకు మీరు ఎటువంటి పత్రాలు చూపించనవసరం లేదు. మీకు తెలిసిన వివరాలు చెప్పండి చాలు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.


చాణక్యుడి ముందు నేనెంత?

‘భారత రాజకీయాలలో చాణక్యునిగా నన్ను నేను పరిగణించుకోలేదు. నేను చాణక్యుడినని ఎప్పుడూ చెప్పలేదు. చాణక్యుడి గురించి పుస్తకాల్లో చదువుకున్నాను. ఆయనముందు నేను ఎందుకూ పనికిరాని వాడిని. చాణక్యుడితో నన్ను పోల్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్‌ను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తానని మోదీజీ చెప్పారు. ఆ కలను మోదీజీ నెరవేర్చగలరన్న నమ్మకం నాకుంది. నా చివరి శ్వాస వరకు నేను బీజేపీలోనే ఉంటాను’ అని అమిత్‌షా చెప్పారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close