అంతర్జాతీయంటాప్ స్టోరీస్

45 వేల కోట్లు ఇవ్వ‌డానికి రెడీ.. ఐరాస‌కు ఎల‌న్ మ‌స్క్ స‌వాల్‌

elon musk | ‘నా టెస్లా షేర్లు అమ్మేసి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ) 600 కోట్ల డాలర్ల (రూ. 45వేల కోట్లు) విరాళం ఇవ్వడానికి నేను రెడీ’ అని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. అయితే తన విరాళం ప్రపంచంలో ఆకలి సమస్యను అంతం చేయగలదని నిరూపించే ప్రణాళిక ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు, ఆ డబ్బు ఖర్చుకి సంబంధించిన ఖాతాలు పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రజలు చూడగలిగేలా బహిరంగంగా ఉంచాలని సవాల్‌ విసిరారు. ట్విట్టర్‌లో ఐరాస డబ్ల్యూఎఫ్‌పీ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లే సూచనకు అదే వేదికపై మస్క్‌ స్పందించారు. అసలు బీస్లే ఏమన్నారు? మస్క్‌ 600 కోట్ల డాలర్లు ఇవ్వాలని కోరడానికి బీస్లే లెక్క ఏమిటి? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఆరోవంతు చాలు..

ఇటీవల హెర్ట్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ లక్ష టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల కోసం ఆర్డర్‌ చేసింది. దాంతో మస్క్‌ సంపద ఒక్కసారిగా 3,600 కోట్ల డాలర్లు పెరిగిందని బీస్లే ప్రస్తావించారు. దాంట్లో ఆరోవంతు.. అంటే 600 కోట్ల డాలర్లతో.. ఆకలి బాధతో అల్లాడుతున్న 4.2 కోట్ల మందిని కాపాడవచ్చని పేర్కొన్నారు. మస్క్‌ మాత్రమే కాదు మిగతా ప్రపంచ కుబేరులు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని బీస్లే ఇటీవల సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో కోరారు. ఆ సమయంలో మస్క్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు తమ సంపదలో కొద్ది శాతం ఇచ్చినా ప్రపంచంలోని ఆకలిని పారదోలవచ్చన్నారు.

అతని సంపదతో పోలిస్తే…

మస్క్‌ ఏమైనా మామూలు వ్యక్తా? ఆయన ఆలోచనలు, లెక్కలు ఓ పట్టాన ఎవరికీ అర్థంకావు. అందుకే బీస్లే సూచనకు వెంటనే స్పందిస్తూ ‘నేను రెడీ మీరు రెడీనా’ అంటూ సవాల్‌ విసిరారు. టెస్లాలో తన షేర్లను వెంటనే అమ్మేసి బీస్లే అడిగినట్టు 600 కోట్ల డాలర్లు ఇస్తానని, అయితే ఆ విరాళంతో ప్రపంచంలో ఆకలిని ఎలా నిర్మూలిస్తారో వివరించాలని కోరారు. స్పేస్‌ ఎక్స్‌ అధిపతి కూడా అయిన మస్క్‌ ప్రస్తుత సంపద 31,100 కోట్ల డాలర్లు. అందులో 600 డాలర్లు ఎంత? పైగా మస్క్‌ సంపద సెకనుకి 5.34 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు) అని ఇటీవల ఓ సంస్థ లెక్కకట్టింది.

అప్పుడు గెంటేయండి!

మస్క్‌ సవాల్‌కు బీస్లే వివరణ ఇచ్చారు. 600 కోట్ల డాలర్లతో ప్రపంచంలోని ఆకలి సమస్య పరిష్కారం కాదని ఒప్పుకొన్నారు. కానీ భౌగోళిక రాజకీయ అస్థిరతను, సామూహిక వలసలను నివారించడానికి, కరువు అంచుల్లో ఉన్న 4.2 కోట్ల మందికి ఉపయోగపడుతుందని తెలిపారు. మీ సహాయంతో ఒక ఆశను కల్పించవచ్చని, భవిష్యత్తును మార్చవచ్చన్నారు. ‘నెక్స్‌ ఫ్లైట్‌ ఎక్కి మీ దగ్గరికొస్తాను. మనం మాట్లాడుకుందాం. నేను చెప్పింది నచ్చకపోతే నన్ను మెడ పట్టుకొని బయటకి గెంటేయండి’ అని పేర్కొన్నారు.

లక్ష కార్ల కోసం వచ్చిన ఆర్డర్‌తో ఎలాన్‌ మస్క్‌ సంపద 3,600 కోట్ల డాలర్లు పెరిగింది. అందులో ఆరోవంతుతో ప్రపంచంలో ఆకలిని నిర్మూలించవచ్చు

-ఐరాస డబ్ల్యూఎఫ్‌పీ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లే

ఇప్పటికిప్పుడు నా టెస్లా షేర్లు అమ్మి 600 కోట్ల డాలర్లు ఇస్తా. వాటితో ప్రపంచంలో ఆకలి సమస్య అంతమవుతుందని నిరూపించండి.

– టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close