రాజకీయం

ఝూటా బీజేపీ

  • నాడు ఆమనగల్‌లో టీఆర్‌ఎస్‌ గద్దె కూల్చి.. నేడు దుష్ప్రచారం
  • దుబ్బాక ఎన్నికల వేళ అడ్డంగా దొరికిన కాషాయ నేతలు
  • సోషల్‌ మీడియాలో అడ్డగోలుగా అసత్య ప్రచారం
  • బీజేపీ ధర్పల్లి మండల కార్యదర్శి తప్పడు పోస్టులు
  • రిటర్నింగ్‌ అధికారికి సుప్రీంకోర్టు లాయర్‌ ఫిర్యాదు
  • శ్రీనివాస్‌నాయక్‌ను అరెస్టు చేసిన దుబ్బాక పోలీసు

అబద్ధాలకు అంతైనా ఉండాలి. మాటకు, చేతకు పొంతనైనా ఉండాలి. పేరు గొప్ప జాతీయపార్టీ బీజేపీ ఈ విలువలన్నింటినీ గాలికొదిలింది. టీఆర్‌ఎస్‌ కోట, టీఆర్‌ఎస్‌ సీటు అయిన దుబ్బాకలో దక్కని గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతున్నది. విజయం అందని ద్రాక్ష అని అర్థంకావడంతో అయోమయంతో అన్ని హద్దులూ దాటుతున్నది. దివంగత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంపై అవాకులు చెవాకులతో యాంటీ సోషల్‌ దాడికి దిగిన బీజేపీ నేతలు.. టీఆర్‌ఎస్‌పై విషప్రచారం చేస్తున్నారు. పాత వీడియోలను తప్పుడు పద్ధతిలో వాడుకుంటూ, టీఆర్‌ఎస్‌లో ఏదో గందరగోళం ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అడ్డమైన పనిచేసే అడ్డంగా దొరికిపోయారు.

దుబ్బాక: దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ జెండా గద్దెల్ని కూలుస్తున్నట్టుగా నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండల బీజేపీ నాయకుడు శ్రీనివాస్‌నాయక్‌ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. ఎప్పుడో 2019లో కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో జరిగిన ఘటనను దుబ్బాకలో జరిగిందంటూ ధర్పల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఏఐబీఎస్‌ఎస్‌ యూత్‌ సెక్రటరీ లావుడ్య శ్రీనివాస్‌ పెట్టిన పోస్టుపై సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్యకు ఫిర్యాదుచేశారు. 

ఈ పోస్టు ఎన్నికల సక్రమ నిర్వహణకు విఘాతం కలిగిస్తుందని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలించేలా, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేదిగా ఉన్నదని పేర్కొన్నారు. చెన్నయ్య ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు బండారం బయటపెట్టారు. పాత వీడియోను ఇప్పటి వీడియోగా ప్రచారం చేశాడని ధ్రువీకరించారు. వాస్తవానికి ఆ దిమ్మెను కూలగొట్టింది టీఆర్‌ఎస్‌వాళ్లు కాదు.. బీజేపీ వాళ్లే.  తమ నేత ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరటాన్ని జీర్ణించుకోలేక జెండా దిమ్మెలపై ఇలా తమ నీచబుద్ధిని ప్రదర్శించారు. ఈ తప్పుడు పోస్టు పెట్టిన శ్రీనివాస్‌ను అరెస్టుచేసి, ఆయన తన పోస్టింగ్‌కు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య, ధర్పల్లి సీఐ ప్రతాప్‌ హెచ్చరించారు.

నీచ రాజకీయాల బీజేపీ

దుబ్బాకలో దుబ్బ బుక్కుడు ఖాయంగా తేలిపోయిన బీజేపీ నీచ రాచకీయాలకు తెగబడుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కున్న ప్రజాబలం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ముందు నిలబడలేక గులాబీ సైన్యంపై కాషాయ కూటమి అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నది. ఎక్కడో, ఎప్పుడో జరిగిన సంఘటనను దుబ్బాకలో జరిగినట్టు చిత్రీకరించి.. అడ్డంగా దొరికిపోయింది. టీఆర్‌ఎస్‌పైనా, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, ఎన్నికల ప్రచారంలో తలమునకలైన మంత్రి టీ హరీశ్‌రావుపైనా చివరికి అభ్యర్థిపైనా వ్యక్తిగత దూషణలు చేస్తూ బీజేపీ నేతలు పబ్బం గడుపుకోవటాన్ని అర్థం చేసుకున్న దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారు. ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్‌, బీజేపీలు అసత్య ప్రచారానికి దిగజారాయి. ఈ క్రమంలోనే దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గద్దెలను కూల్చివేస్తున్నారంటూ ఆ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధంలేని వ్యక్తితో బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని పలువురు మండిపడుతున్నారు.

ఎదుర్కొనే దమ్ములేక

తమ ఉనికి కూడా కష్టమేనని అర్థమైపోయిన బీజేపీ నేతలు.. కుటిలబుద్ధితో కుత్సితాలకు పాల్పడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. స్థానికంగా బలంలేని బీజేపీ.. ఇతర జిల్లాల నుంచి అరువు తెచ్చుకున్న కార్యకర్తలతో అసత్యప్రచారానికి తెగబడుతున్నదంటూ దుబ్బాక జనం ఛీకొడుతున్నారని టీఆర్‌ఎస్‌ మండిపడుతున్నది. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో తమ ఎజెండా చెప్పుకోవడం సహజం. ఇలాంటి విషయాల్లో బీజేపీ నేతలు చాలా గొప్పలే చెప్తుంటారు. విలువలంటూ బాకాలు ఊదుతుంటారు. మరోవైపు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. నీతి నియమాల గురించి, విలువల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. తప్పుడు ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ విషయంలో ఏం వివరణ ఇచ్చుకుంటారో! నిజాయితీగా స్పందిస్తారా? లేక తమదైన శైలిలో వాస్తవాలకు మసిబూసేందుకే ప్రయత్నిస్తారా? చూడాలి.

బీజేపీ దిగజారుడు రాజకీయం

పాత వీడియో పట్టుకుని బీజేపీ నేతలు తప్పుడు ప్రచా రం చేయడం హేయమైన చర్య. టీఆర్‌ఎస్‌ను ఎదిరించలేకే సోషల్‌ మీడియాలో తప్పు డు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆ పార్టీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం.

-ఫారూఖ్‌హుస్సేన్‌, ఎమ్మెల్సీ 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close