అంతర్జాతీయంటాప్ స్టోరీస్

కరోనా పాలిటిక్స్‌

  • డబ్ల్యూహెచ్‌వో వేదికగా కత్తులు దూసుకుంటున్న అమెరికా, చైనా
  • చైనా చేతుల్లో డబ్ల్యూహెచ్‌వో కీలుబొమ్మన్న ట్రంప్‌ 
  • 30 రోజుల్లో వైఖరి మారకపోతే సంస్థ నుంచిశాశ్వతంగా వైదొలుగుతామని లేఖాస్త్రం
  • కరోనా కట్టడిలో అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేట్రంప్‌ ఆరోపణలు చేస్తున్నారన్న చైనా
  • వైరస్‌పై దర్యాప్తు చేయాలన్న తీర్మానానికి డబ్ల్యూహెచ్‌వో సభ్యదేశాల ఆమోదం

కరోనా కేంద్రంగా ప్రపంచ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సమావేశం వేదికగా అగ్రరాజ్యాలు అమెరికా, చైనా పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. చైనా చేతుల్లోంచి బయటపడి నెలరోజుల్లోగా స్వతంత్రంగా వ్యవహరించకపోతే డబ్ల్యూహెచ్‌వో నుంచి తాము వైదొలుగుతామని, నిధులను శాశ్వతంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో అధిపతి టెడ్రోస్‌ అధనోమ్‌కు ఒక లేఖాస్ర్తాన్ని సంధించారు. అయితే స్వదేశంలో కరోనాను నియంత్రించలేని ట్రంప్‌.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారని చైనా విమర్శించింది. మరోవైపు, డబ్ల్యూహెచ్‌వోపై ట్రంప్‌ చేస్తున్న విమర్శల దాడి వల్ల ఆ సంస్థపైనా, అంతిమంగా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

డబ్ల్యూహెచ్‌వో తప్పిదాలతో భారీ మూల్యం: ట్రంప్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని డబ్ల్యూహెచ్‌వోపై కారాలు మిరియాలు నూరుతున్న ట్రంప్‌.. ఆ సంస్థకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. చైనా చేతుల్లోంచి బయటపడి స్వతంత్రంగా వ్యవహరించకపోతే సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు. 30 రోజుల్లోగా తన విధానాన్ని మార్చుకోకపోతే డబ్ల్యూహెచ్‌వోకు నిధులను శాశ్వతంగా నిలిపివేస్తామని ఆ సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌కు సోమవారం రాసిన లేఖలో స్పష్టంచేశారు. ‘కొవిడ్‌-19 విషయంలో మీరు, మీ సంస్థ పదేపదే చేస్తున్న తప్పుల కారణంగా ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తున్నది. వచ్చే 30 రోజుల్లో స్థిరమైన చర్యలు తీసుకోకపోతే తాత్కాలికంగా నిలిపేసిన మా నిధులను శాశ్వతంగా రద్దుచేస్తాం. సంస్థలో మా సభ్వత్వం గురించి కూడా పునరాలోచిస్తాం’ అని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా ఏటా 500 మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నది. కరోనా విషయంలో సంస్థ తీరుపై గుర్రుగా ఉన్న ట్రంప్‌ ఇటీవలే ఆ నిధులను తాత్కాలికంగా నిలిపేశారు. 

అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే:చైనా

ట్రంప్‌ హెచ్చరికలపై చైనా స్పందించింది. స్వదేశంలో కరోనా కట్టడిలో విఫలమైన ట్రంప్‌.. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే చైనాను ఒక సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ విమర్శించారు. చైనాపై నిందవేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇకనైనా నిందారోపణలు మాని, కరోనా నియంత్రణకు అంతర్జాతీయ సమాజానికి సహకరించాలని సూచించారు. ‘డబ్ల్యూహెచ్‌వోకు ఎవరు ఎంత చెల్లించాలన్నది సభ్యదేశాలన్నీ కలిసి నిర్ణయిస్తాయి. అది అమెరికా నిర్ణయించదు. నిర్దేశించిన మొత్తాన్ని సకాలంలో చెల్లించడం సభ్యదేశాల బాధ్యత. నిధులను నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించడం.. తన అంతర్జాతీయ బాధ్యతను విస్మరించడమే’ అని పేర్కొన్నారు.

ఇప్పుడే స్పందించలేం: డబ్ల్యూహెచ్‌వో

ట్రంప్‌ లేఖపై డబ్ల్యూహెచ్‌వో తక్షణమే స్పందించలేదు. ప్రపంచ ఆరోగ్య సభ (డబ్ల్యూహెచ్‌ఏ) అజెండాను సిద్ధం చేసేపనిలో తాము తీరిక లేకుండా ఉన్నామని, ఇప్పటికిప్పుడు ట్రంప్‌ లేఖపై స్పందించలేమని డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి ఫెడలా చైబ్‌ పేర్కొన్నారు. త్వరలోనే లేఖపై స్పందిస్తామని చెప్పారు. ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్‌వోకు దన్నుగా నిలువాలని యూరోపియన్‌ యూనియన్‌ కోరింది. ఒకరిపై ఒకరు వేలేత్తి చూపేందుకు ఇది సమయం కాదని పేర్కొంది.కరోనా పుట్టుక, వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో స్పందించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు కోసం ఈయూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. భారత్‌తో సహా 130కిపైగా దేశాలు దీనికి మద్దతు తెలిపాయి. మంగళవారం ముగిసిన ప్రపంచ ఆరోగ్య సభ భేటీలో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close