రాజ్యసభలో విభజన హామీల చర్చ… సుజనా ఫైర్

రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ రాజ్యసభలో కాసేపటి క్రితం ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఈ చర్చను ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభలో సాక్షాత్తు ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలు, చట్టాలు కూడా ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను కూడా కేంద్ర ప్రభత్వం పక్కన పెటుతోందని విమర్శించారు. విభజన హామీల విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో ఏపీ ప్రజల భవితవ్యం అంధకారంలో పడిందని సుజనా చౌదరి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ ప్రజలు గత నాలుగేళ్లుగా ఎదురు చూశారని, ఇప్పుడు నమ్మకం కోల్పోయారని అన్నారు. దేశంలో చోటు చేసుకుంటున్న మూక దాడుల తరహాలోనే ఏపీపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. సహకార స్పూర్తికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోందని సుజనా విమర్శించారు. ఏపీ ప్రజలను కాపాడాలని ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ఏపీని కాపాడాలని, ఏపీని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు. తమకు న్యాయంగా రావాల్సినవి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామని, తాము ఏదీ అడుక్కోవడం లేదంటూ ప్రసంగాన్ని ముగించారు.