క్రైమ్

బీమా ముసుగులో దోచేశారు!

  • వితంతువు నుంచి 10 లక్షలు లాగేసిన సైబర్‌ మోసగాళ్లు
  • చనిపోయిన భర్త బీమా చేశారంటూ ఎర
  • రూ.24 లక్షలు ఇన్సూరెన్స్‌ డబ్బులు వస్తాయని వల
  • దర్యాప్తు చేస్తున్న రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు

గుర్తుతెలియని వ్యక్తి.. : ‘హలో.. నేను ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీ భర్తపేరు గణేశ్‌ (పేరు మార్చాం) కదా. మేం మాట్లాడే ఫోన్‌నంబర్‌ ఆయనదేనా. చిరునామా కన్ఫర్మ్‌చేస్తారా? అయితే ఓసారి సర్‌కు ఫోన్‌ ఇవ్వండి.

మహిళ: సర్‌ చనిపోయి ఎనిమిదేండ్లయింది.

గుర్తు తెలియని వ్యక్తి: అయ్యో సారీ మేడం. సర్‌ 2009లో ఇన్సూరెన్స్‌ పాలసీ చేశారు. మూడేండ్లపాటు రూ.54 వేలు ప్రీమియం చెల్లించారు. ఇంకో రెండు ఇన్‌స్టాల్మెంట్లు కడితే మీకు రూ.24 లక్షలు వస్తాయి. చనిపోయినా కూడా సర్‌ మీకు డబ్బు వచ్చేలా చేశారు.

..ఇవన్నీ నిజమేనని నమ్మిన రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 9 నెలల వ్యవధిలో ట్యాక్సులు, ఇతర చెల్లింపుల పేరిట రూ.10 లక్షల వరకు వివిధ ఖాతాల్లో జమచేశారు. ఎంతకీ ఇన్సూరెన్స్‌ డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించి ఇటీవల రాచకొండ సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశారు. మహిళా సాఫ్ట్‌ ఇంజినీర్‌ భర్త ఎనిమిదేండ్ల కిందట చనిపోగా, గత ఆగస్టులో ఇన్సూరెన్స్‌ కంపెనీ పేరిట ఆమెకు ఫోన్‌కాల్‌ వచ్చింది. రూ.54 వేలు చెల్లిస్తే భర్త పేరిట ఉన్న బీమా సొమ్ము రూ.24 లక్షలు వస్తాయని చెప్పడంతో ఆమె నమ్మారు. మొదట రూ.36 వేలు చెల్లించారు. ఆ తర్వాత జీఎస్టీ, ఇతర ట్యాక్స్‌లంటూ దాదాపు తొమ్మిదినెలల వ్యవధిలో మోసగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతా నంబర్లలో రూ.10 లక్షలను జమచేశారు. డబ్బు డిపాజిట్‌ చేసిన ఖాతాలను పరిశీలించిన రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు.. ఢిల్లీలోని వివిధ బ్యాంకుల్లో జమయినట్టు గుర్తించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సర్వర్‌ హ్యాకా.. సమాచార చౌర్యమా?

సైబర్‌ దొంగలు పలు ఇన్సూరెన్స్‌ కంపెనీల సర్వర్లను హ్యాక్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని ఆధారంగా సగం ప్రీమియంలు చెల్లించిన పాలసీల వివరాలు తెలిసి ఉంటాయని భావిస్తున్నారు. ఫోన్‌నంబర్‌, ఇతర వివరాలను చెప్పడంతో చాలామంది అమాయకులు నమ్మి మోసపోతున్నట్టు గుర్తించారు. ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో పనిచేసే సిబ్బంది సైబర్‌ మోసగాళ్లతో చేతులు కలిపి ఏండ్ల కిందట సగం చెల్లించి ఆపేసిన ఇన్సూరెన్స్‌ పాలసీల సమాచారాన్ని ఇచ్చి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మధ్యలో ఆగిపోయిన ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియంలకు తిరిగి ఇన్‌స్టాల్మెంట్లు చెల్లిస్తే మొత్తం డబ్బు ఇస్తామని ఎవరైనా ఫోన్‌చేస్తే అది కచ్చితంగా సైబర్‌ ఫ్రాడ్‌ కాల్‌ అని రాచకొండ సైబర్‌క్రైం ఠాణా ఏసీపీ హరినాథ్‌ తెలిపారు. ఇన్సూరెన్స్‌ కార్యాలయానికి నేరుగా వెళ్లాలని సూచించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close