స్పెషల్

వరిని మించి సిరులు

 • వైవిధ్య సేద్యానికి మన మంచి నేల 
 • రూపాయికి రూపాయిన్నర లాభం
 • పలు పంటల సాగుకు అవకాశం
 • రైతు మారితేనే గిట్టుబాటు ధర
 • రూపాయికి రూపాయిన్నర లాభం
 • పప్పులు, నూనె గింజలకు గిరాకీ
 • వేరుశనగ, పొద్దుతిరుగుడు,మక్కలకూ  పుష్కలమైన డిమాండ్‌
 • కూరగాయల్లోనూ మంచి రాబడి

క్షేత్రమెరిగి విత్తనమేయాలి.. పాత్రమెరిగి దానం చేయాలి..అని పెద్దల మాట. తెలంగాణ రైతులో ఎంత జీవమున్నదో.. తెలంగాణ నేలలో అంత సారమున్నది. ఈ భూమి తెలంగాణ తల్లి మనకిచ్చిన వరం. ఇక్కడ వరే కాదు.. అన్ని రకాల పంటలు పండుతాయి. మన భూమినిబట్టి.. భూసారాన్ని బట్టి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో.. గిట్టుబాటు దక్కుతుందో ఆ పంటనే మనం పండించాలి. గిరాకీ లేని పంట పండిస్తే దక్కేదేమీ ఉండదు. గిరాకీకి తగిన పంటను పండించినప్పుడే గిట్టుబాటు లభిస్తుంది. రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర లాభమొచ్చే పంట ఏదో అదే వేయాలి. ఆ పంట ఏమిటో ప్రభుత్వమే చెప్తున్నది. అందుకే ప్రభుత్వం మాటే అన్నదాత బాట కావాలి.  

పురుగులమందే పెరుగన్నంలా మారిన నాటి పీడ కలల నుంచి… పుట్లకొద్దీ వడ్లతో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఇంకామేలుచేసే యోచనతో ఒక క్రమపద్ధతి ప్రకారం పంటలు పండించే పనికి శ్రీకారం చుడుతున్నది. కాలానికి అనుగుణంగా తెలంగాణ రైతులు ఒడుపు చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిమాండ్‌.. సరఫరా సూత్రం ఆధారంగా పంటలను వేస్తే తప్ప చేసిన సేద్యానికి సార్థకత లభించదని శాస్త్రీయంగా చెప్తున్నారు. ముందుగా మన రాష్ట్ర అవసరాలు, ఎగుమతి డిమాండ్‌ ఆధారంగా పంటలు వేసుకొంటే లాభసాటి వ్యవసాయం చేయవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

అందరూ మూకుమ్మడిగా వరి పంటనో.. మిర్చి.. లేదా పత్తి పంటనో వేసి దిగుబడిని అమ్ముకోలేక అల్లాడిపోవడం కంటే.. ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని అవసరానికి అనుగుణంగా పెంచుకొంటూపోతే లబ్ధి పొందవచ్చంటున్నారు. వరిసాగులో ఒక రూపాయి ద్వారా ఎంత ఆదాయాన్ని సంపాదిస్తాడో.. అంతకుమించి సంపాదించవచ్చని పేర్కొంటున్నారు. వరి కాకుండా మంచి ఆదాయాన్ని పొందే ఇతర పంటలు, వాటి డిమాండ్‌ను ఓ సారి పరిశీలిస్తే అనేక పంటలు మంచి లాభసాటిగా ఉన్నాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిశోధనావిభాగం డైరెక్టర్‌ రుమాండ్ల జగదీశ్‌ రైతులకు సూచిస్తున్నారు. వివిధ పంటల సాగు.. దిగుబడి.. వచ్చే ఆదాయం గురించి వివరించారు. 


కందులు

కేంద్రప్రభుత్వం కనీస మద్దతుధర ప్రకటించిన పంట. ఎకరాకు 3.65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులుపోను నికరంగా రైతుకు ఎకరాకు రూ.4500 పైగా మిగులుతుంది. రూపాయి ఖర్చుపెడితే అదనంగా రూ.1.28 ఆదాయముంటుంది. రాష్ట్రంలో ఏడాదికి పది లక్షల ఎకరాల్లో కందుల సాగుకు అవకాశం ఉన్నది. పప్పుధాన్యాల్లో ప్రధాన పంట. ప్రొటీన్‌కోసం వినియోగదారులు ఎక్కువగా వాడుతారు కాబట్టి డిమాండ్‌ ఎన్నటికీ తగ్గదని నిపుణులు చెప్తున్నారు. 

 నూనెగింజలకు మంచి డిమాండ్‌

మార్కెట్లో నూనెగింజలకు మంచి డిమాండ్‌ ఉన్నది. మనదేశం ఏడాదికి సాలీనా రూ.70 వేల కోట్ల విలువైన నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. వేరుశనగ, నువ్వులు, సోయాబీన్‌, పొద్దు తిరుగుడు, ఆముదం వంటి పంటల సాగు రైతుకు మంచి లాభసాటిగా ఉంటుంది. ఈసాగు రెట్టింపు పెట్టుబడి ఆదాయాన్నిస్తుంది. 

పెసర్లు

రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ మంచి డిమాండ్‌ ఉన్న పంట. కేంద్రం క్వింటాలుకు మద్దతు ధరను రూ.7050గా ప్రకటించింది. రైతులకు లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.8,042 మాత్రమే. ఎకరాకు రూ.14,729 నికర ఆదాయం వస్తుంది. ప్రతి రూపాయి పెట్టుబడికి అదనంగా రూ.1.83 లాభం వస్తుంది. 

 మినుములు

రైతుకు భారీ ఆదాయాన్ని ఇచ్చే పంట ఇది. ఎకరాకు దిగుబడి 4.82 క్వింటాళ్ల వరకు ఉంటుంది. కేంద్ర మద్దతు ధర రూ.5,700 గా ఉన్నది. ఎకరాకు ఆదాయం రూ.27 వేల పైమాటే. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రైతుకు రూ.18,856 వరకు మిగులుతుంది. పెట్టుబడితో పోలిస్తే ఇది మంచి లాభసాటి. రైతు పెట్టే రూపాయి పెట్టుబడిపై అదనంగా రూ.2.19 వరకు వస్తుంది. 

  శనగలు

నల్ల భూముల్లో.. యాసంగిలో పండే వర్షాధార పంట. శనగలసాగులో ఎకరాకు రూ.6.2 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. ఎకరాకు రూ.30 వేలకు పైబడి ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.16 వేలకుపైగా నికర ఆదాయం వస్తుంది. రైతు పెట్టే ప్రతి రూపాయికి అదనంగా రూ.1.23 ఆదాయం వస్తుంది. 

 మక్కజొన్న

ఏడాది పొడవునా డిమాండ్‌ ఉండే పంట. రెండు కార్లలోనూ సాగుచేసుకొనేందుకు అనువైనది. ఎకరాకు 25.39 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వేరే పంటలతో పోలిస్తే అధిక దిగుబడినిస్తుంది. కేంద్రం క్వింటాలుకు రూ.1,760 మద్దతు ధర ప్రకటించింది. అన్ని ఖర్చులు పోను రైతుకు నికరంగా ఎకరాకు రూ.25,801 ఆదాయం వస్తుంది. అంటే రైతు పెట్టే ప్రతి రూపాయికి అదనంగా రూ.1.37 డబ్బులు వస్తాయి.  పౌల్ట్రీ రంగంలో దాణాగా ఎక్కువగా వినియోగమున్నది. దేశంలోనే ఎక్కువ సంఖ్యలో పౌల్ట్రీలు తెలంగాణలోనే ఉన్నాయి. అందుకే ఏడాది పొడవునా దీనికి డిమాండ్‌ ఉంటుందని నిపుణుల మాట. 

 కూరగాయల సాగూ అవసరమే

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) సిఫారసు మేరకు ఒక వ్యక్తికి రోజుకు 325 గ్రాముల కూరగాయలు తినాలి. వ్యవసాయ వర్సిటీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఒక వ్యక్తి 250 గ్రాముల కూరగాయలు తింటున్నాడు. అంటే ఒక వ్యక్తికి రోజుకు 75 గ్రాముల కొరత ఉన్నది. ఐసీఎమ్మార్‌ సిఫారసు మేరకు రాష్ట్రంలోని 3.52 కోట్ల జనాభాకు రోజుకు 41.75 లక్షల టన్నుల కూరగాయలు కావాలి. కానీ రాష్ట్రంలో ఉల్లితోసహా కూరగాయల ఉత్పత్తి 3.11 లక్షల ఎకరాల్లో రోజుకు 30.71 లక్షల టన్నులు మాత్రమే. రోజుకు 11.04 లక్షల టన్నుల కూరగాయల కొరత ఉన్నది. ఈ క్రమంలో ఉద్యానశాఖ కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 

 తెలంగాణ రైతును ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

తెలంగాణ రైతును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు. ఆరేండ్లలో అన్ని వసతులు కల్పించారు. 24 గంట ల విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు.. సాగునీటి కల్పన, రైతుబంధు.. ఇలా అన్నదాతకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించారు. ఇప్పుడు పంటల సాగుపై దృష్టి సారించారు. రైతులు ప్రభుత్వం చూపిన మార్గంలో పంటలను సాగుచేయాలి. ఏడాదిలో ఒక పంట వరి వేసి.. ఆపై మక్కజొన్న, వేరుశనగ, ఆవాలు వంటివి వేయాలి. 

– ప్రొఫెసర్‌ ప్రవీణ్‌రావు, వైస్‌ చాన్స్‌లర్‌, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ

ఆరోగ్యకరమైన పంటలు

జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ప్రజలు రాగులు, సజ్జలు, జొన్న వంటి వాటి వైపు మొగ్గుచూపుతున్నారు. వీటికి కావాల్సిన నీటి పరిమాణం తక్కు వే. రాగి ఎకరాకు 6-7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీనికి మద్దతు ధర రూ.3150 గా ఉన్నది. ఎకరాకు రూ.18,900 నుంచి రూ.22,050 వరకు ఆదాయం వస్తుంది. ఖర్చులుపోను ఎకరాకు రైతుకు నికరంగా రూ.10-14 వేలు మిగులుతాయి. జొన్న కూడా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడితో ఎకరాకు రైతుకు రూ.10 నుంచి రూ.15 వేల నికర ఆదాయం లభిస్తుంది. సజ్జలు సైతం మద్దతుధర రూ.2 వేల వరకు ఉన్నందున ఖర్చులు పోను రూ.9-13 వేల వరకు నికర ఆదాయం ఉంటుంది. కొర్రలు కూడా ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడితో ఎకరాకు రూ.11 నుంచి రూ.20 వేల వరకు ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. 

శాస్త్రీయ సాగుతోనే రైతన్నకు బాగు

నీళ్లుంటే చాలు.. వరి వైపు పరుగులు తీయడం సాధారణంగా మారింది. 2019-20లో ఇది కండ్ల ముందు కనిపించింది. వాస్తవంగా మునుపటికంటే వరి సాగు విస్తీర్ణం పెరగడం శుభసూచకమైనా.. దీన్ని నియంత్రణలో ఉంచితే తప్ప రైతన్నకు మేలుజరిగే పరిస్థితి ఉండదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సాగును శాస్త్రీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇతర పంటల్ని కూడా  ప్రో త్సహించేందుకు కార్యాచరణను అమలుచేస్తున్నది. వ్యవసాయశాఖ లెక్కించే సాధారణ విస్తీర్ణంకంటే తక్కువగా పలు ప్రధానపంటల సాగు జరిగింది. 

 • నూనెగింజల సాగు యాసంగిలో సాధారణ విస్తీర్ణం 4.02 లక్షల ఎకరాలు కాగా, వాస్తవ సాగు విస్తీర్ణం 2.98 లక్షల ఎకరాలకు పరిమితమైంది. 
 • వేరుశనగ 3.21 లక్షల ఎకరాలకు బదులుగా 2.27 లక్షల ఎకరాలు, పొద్దుతిరుగుడు 1.97 లక్షల ఎకరాలకు బదులు అందులో సగం సాగుచేశారు. కుసుమ 9,800 ఎకరాలకు బదులుగా 2,500 ఎకరాల్లోపే సాగుచేశారు. 
 • గోధుమలు 15 వేల ఎకరాల విస్తీర్ణంలో సాధారణ సాగు కాగా, 9,800 ఎకరాల్లో సాగయింది. 
 • పెసర్లు 27,182 ఎకరాల మేర సాధారణ విస్తీర్ణమైతే 14 వేల ఎకరాల్లో, మినుములు సాధారణం కంటే 3వేల ఎకరాలు తక్కువగా సాగుచేశారు. 
 • కందిపప్పునకు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉన్నా 7 లక్షల ఎకరాల్లోనే సాగుచేశారు. ప్రభుత్వం దీన్ని 10 లక్షల ఎకరాలుగా నిర్ధారించింది.
Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close