ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు

ప్రపంచ జనాభాలో 1.3 శాతం మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య పది కోట్లు దాటింది. ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 21 లక్షలు దాటినట్లు ఓ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొన్నది. ప్రతి 7.7 సెకన్లకు ఓ వ్యక్తికి వైరస్ సంక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు సగటున 668250 కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల రేటు 2.15 శాతం ఉన్నట్లు తేలింది. వైరస్ ప్రభావానికి గురైన దేశాల్లో అమెరికా, ఇండియా, బ్రెజిల్, రష్యా, యూకేలు ఉన్నాయి. ఈ దేశాల్లోనే సగం కన్నా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 5 కోట్లు చేరేందుకు 11 నెలల సమయం పట్టింది. అయితే గత మూడు నెలల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు 56 దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఆ దేశాల్లో 6.4 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇజ్రాయల్ తమ దేశ జనాభాలో 29 శాతం మందికి టీకాలు వేసింది.