జాతీయం

హార్ట్ రిథ‌మ్ : క‌రోనా కార‌ణంగా అరిథ్మియాకు అవ‌కాశాలు

గుండె కోట్టుకోవ‌డంలో మార్పులు రావ‌డం కూడా ఆరోగ్య స‌మ‌స్య‌నే. దీనినే వైద్య ప‌రిభాష‌లో అరిథ్మియా అంటారు. హృదయ స్పందన ఎప్పుడు, ఎలా క‌లుగుతుందో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్ర‌స్తుతం ఉద్ధృతంగా ఉన్న‌ కరోనా వైర‌స్‌ అరిథ్మియాను ప్రేరేపించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇది ప్రాణాంత‌కం కూడా అని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. గుండె కొట్టుకునే విధానంపై అవ‌గాహ‌న క‌లిగించేందుకు వరల్డ్ హార్ట్ రిథమ్ వీక్‌ను ప్ర‌తి ఏటా జూన్ 7-13 వ‌ర‌కు జ‌రుపుకుంటారు.

కరోనా వైర‌స్ ఎక్కువ‌గా వ్యాప్తిలో ఉన్న ఈ స‌మ‌యంలో గుండెను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటే కాకుండా శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేసి వాటిని సజీవంగా ఉంచుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారం, ఊబకాయం, నిశ్చల జీవనశైలి, మద్యం, పొగాకు అలవాట్ల కార‌ణంగా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా గుండెపై పెరుగుతున్న భారాన్ని తగ్గించుకోవ‌డం చాలా ముఖ్యమ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

కొన్నిసార్లు మ‌న హృద‌య స్పందన పెరుగొచ్చు లేదా త‌గ్గిపోవ‌చ్చు. గుండె విద్యుత్ వ్య‌వ‌స్థ‌లో మార్పులు వ‌ల్ల క‌లిగే ఈ అసాధార‌ణ విధానం గుండె కొట్టుకోవ‌డంలో భంగం క‌లిగిస్తుంది. ఎక్కువ‌గా ఒత్తిడికి గురైన‌ప్పుడు, అధిక వ్యాయామం చేసిన సంద‌ర్భాల్లో, ఎక్కువ కెఫిన్ లేదా ఆల్క‌హాల్ తీసుకున్న‌ప్పుడు గుండె కొట్టుకోవ‌డంలో మార్పులు వ‌స్తుంటాయి. ఇలా గుండె అసాధార‌ణంగా కొట్టుకోవ‌డాన్నే అరిథ్మియా అంటారు. అరిథ్మియా ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది 1). టాచీకార్డియా 2). బ్రాడీకార్డియా.

టాచీకార్డియా: గుండె చాలా వేగంగా కొట్టుకున్నప్పుడు.. అంటే నిమిషానికి 100 కంటే ఎక్కువ బీట్స్ రావ‌డాన్ని టాచీకార్డియా అంటారు. కొంద‌రిలో టాచీకార్డియాకు సులభంగా చికిత్స చేయవచ్చు. అయితే మరికొందరిలో ఇది ప్రాణాంతకం కావచ్చు. ఇది సాధారణ శారీరక శ్రమ ద్వారా కూడా ప్రేరేపించబడుతుంది.

బ్రాడీకార్డియా: గుండె చాలా నెమ్మదిగా కొట్టుకున్నప్పుడు బ్రాడీకార్డియా సంభవిస్తుంది. అనగా నిమిషానికి 60 బీట్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది ఎందుకంటే ఇందులో గుండె మొత్తం శరీరానికి తగినంత ఆక్సిజనేటెడ్ రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. ఫ‌లితంగా శ‌రీరంలోని అవ‌య‌వాలు ప‌నిచేయ‌క‌పోవ‌డం, గుండె నిలిచిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చి ప్రాణాంతకంగా మారుతాయి. సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, శ్వాస ఆడకపోవడం అరిథ్మియా వల్ల సంభవిస్తుంది. అయితే మరింత తీవ్రమైన సందర్భాల్లో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ మరణానికి దారితీస్తుంది.

కరోనా మహమ్మారి సమయంలో గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రజల సమస్య చాలా ఎక్కువైంది. కరోనా కారణంగా, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా, గుండె యొక్క ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కార్డియాక్ అరిథ్మియాను ప్రేరేపిస్తుంది, అందుక‌ని క‌రోనా వ‌చ్చిన వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని వైద్యులు చెప్తున్నారు.

రాకుండా ఉండాలంటే..

సమస్య తీవ్రంగా లేకపోతే, ఒత్తిడి లేదా ఆందోళనను తగ్గించడానికి ధ్యానం, యోగా వంటి కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. మద్యం, నికోటిన్ లేదా కెఫిన్ నుంచి దూరంగా ఉండాలి. వైద్యుల సలహా లేకుండా చల్లని లేదా దగ్గు ఔషధం తీసుకోవాలి. స్టెరాయిడ్లను పూర్తిగా దూరం పెట్టాలి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకుంటూ ఉండాలి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close