జాతీయంటాప్ స్టోరీస్

పరిస్థితి చెయ్యి దాటకముందే లాక్ డౌన్ పై ఆలోచించండి: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన!

  • ప్రజలు గుమికూడే కార్యక్రమాలను రద్దు చేయండి
  • లాక్ డౌన్ విధించే పక్షంలో పేదలు ఇబ్బంది పడకుండా చూడాలి
  • కరోనా నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి
  • జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా రెండో దశను నియంత్రించేందుకు మరోమారు లాక్ డౌన్ ను విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇదే సమయంలో ప్రజలు అధికంగా గుమికూడే అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేయాలని పేర్కొంది. “మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలచుకున్నాం. వైరస్ వ్యాపించే అవకాశాలున్న అన్ని రకాల కార్యక్రమాలనూ రద్దు చేయండి. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించండి” అని అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది.

లాక్ డౌన్ ను మరోసారి విధించాలని నిర్ణయిస్తే, ప్రభావితం చెందే పేద ప్రజలకు ఆహారాన్ని అందించి, వారి అవసరాలను తీర్చే దిశగా ముందస్తుగానే ప్రణాళికలను రూపొందించుకోవాలని ధర్మాసనం సూచించింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల రికార్డులను అందించాలని ఆదేశించింది.

కరోనా నియంత్రణపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఏ ఒక్క కరోనా బాధితుడికి కూడా ఆసుపత్రిలో పడక లేదని చెప్పకుండా చూసుకోవాలని, అత్యవసరమైన ఔషధాలను అన్ని ఆసుపత్రులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బాధితుడు ఏ ప్రాంతం వాడైనా, స్థానికంగా నివాసం లేకున్నా, గుర్తింపు కార్డును చూపించకున్నా అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close