తెలంగాణ

సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి సమావేశాలు

  • త్వరలో జిల్లా, మండల వ్యవసాయాధికారులతో చర్చ
  • వ్యవసాయ విస్తరణాధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌
  • రైతుబంధు సమితి ప్రతినిధులతోనూ మాట్లాడనున్న సీఎం
  • ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తెలంగాణలో పంటలసాగు, ప్రత్యామ్నాయ విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటలకు మంచి ధరలు వచ్చేలా చేయడం అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో పంటలకు మంచి ధర వచ్చి, రైతులకు మేలు కలిగేటట్లు చేయాలని సీఎం భావిస్తున్నారు. 

అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో అనేకసార్లు ముఖ్యమంత్రి చర్చించారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి? పండిన పంటను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? తదితర అంశాలపై అధ్యయనం జరిగింది. ఈ సమావేశానికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్‌.. నేరుగా జిల్లా, మండల వ్యవసాయాధికారులతో కూడా చర్చించాలని ఆదివారం నాటి సమీక్షలో నిర్ణయించారు. ఈ సమావేశం తేదీలు త్వరలోనే ఖరారుచేస్తారు. 

అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణాధికారులతో చర్చిస్తారు. రైతుబంధుసమితి ప్రతినిధులతో కూడా సీఎం స్వయంగా మాట్లాడతారు. తెలంగాణ వ్యవసాయాభివృద్ధికోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య పూర్తిస్థాయి పరిష్కారం అవుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అద్భుత తెలంగాణ రూపొందుతుందని తెలిపారు. వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి, వ్యవసాయ యూనివర్సిటీ, పౌరసరఫరాల సంస్థ సమన్వయంతో వ్యవహరించి  రైతులకు మేలు కలిగించే వ్యవసాయవిధానాన్ని అమలుచేసేలా రైతుల్లో చైతన్యం కలిగించాలని కోరారు. 

తెలంగాణలో రానున్న కాలంలో 90 లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరి పంట పండుతుంది. 3.5 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని సీఎం తెలిపారు. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు అనుగుణంగా రాష్ట్రంలో రైసు మిల్లర్లు మిల్లుల సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతుధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా, ఆ ముడిసరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీలసంస్థగా పౌర సరఫరాల సంస్థ రూపాంతరం చెందాలన్నారు. దీంతో రైతులకు మంచిధర లభిస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలనూ అరికట్టవచ్చునని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close