సినిమా

నూటొక్క జిల్లాల అందగాడు

నటుడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి దర్శకరచయితగా ప్రతిభను చాటుకున్నారు Srinivas Avasarala. ఆయన కథను అందిస్తూ హీరోగా నటించిన చిత్రం Nootokka Jillala Andagadu . కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణంలో అగ్రనిర్మాతలు Dil Raju, శిరీష్‌తోపాటు దర్శకుడు క్రిష్‌ భాగస్వామిగా వ్యవహరించడం తెలుగు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. Rachakonda Vidya Sagar ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథే హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? హీరో, రచయితగా అవసరాల శ్రీనివాస్‌ విజయవంతం అయ్యాడా? లేదా? తెలియలంటే కథలోకి వెళ్లాల్సిందే…

గొర్తి సూర్యనారాయణ అలియాస్‌ జీఎస్‌ఎన్‌(అవసరాల శ్రీనివాస్‌) ఓ రియల్‌ఎస్టేట్‌ కంపెనీలో కస్టమర్‌ ఎగ్జిక్యూటిక్‌గా పనిచేస్తుంటాడు. జన్యుపరమైన సమస్యల కారణంగా చిన్నవయసులోనే అతడికి బట్టతల వస్తుంది. తన సమస్యను ఎవరూ గుర్తించకుండా విగ్‌ పెట్టుకొని తిరుగుతుంటాడు. బట్టతల కారణంగానే తనను ఏ అమ్మాయి ప్రేమించడం లేదని మదనపడుతుంటాడు. అతడు పనిచేసే ఆఫీస్‌లో అంజలి(Ruhani Sharma)ఉద్యోగంలో చేరుతుంది. జీఎస్‌ఎన్‌ మంచితనం చూసి అతడిని ప్రేమిస్తుంది. జీఎస్‌ఎన్‌ కూడా అంజలిని ప్రేమిస్తాడు. తన బట్టతల సమస్యను అంజలి దగ్గర దాచేస్తాడు. అనుకోకుండా అంజలికి ఆ రహస్యం తెలియడంతో అతడిని దూరం పెడుతుంది. ఆ తర్వాత ఏమైంది? జీఎస్‌ఎన్‌, అంజలి ఒక్కటయ్యారా? తన సమస్యను జీఎస్‌ఎన్‌ ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

బాడీషేమింగ్‌ సమస్య కారణంగా సమాజంలోని చాలా మంది ఆత్మన్యూనత భావంతో క్రుంగిపోతుంటారు. తమలోని లోపాలను ఇతరులు అవహేళన చేస్తారనే భయాలతో ఎవరికీ చెప్పుకోలేక నిరంతరం మదనపడుతుంటారు. తాము అందంగా లేమనే భావనలో సంఘర్షణకు లోనవుతూ ఆప్తులను దూరం చేసుకుంటుంటారు. ఆ అంశాల్ని చర్చిస్తూ రూపొందిన చిత్రమిది. వైకల్యాల్ని అవరోధాలుగా భావిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దనే సందేశంతో అవసరాల శ్రీనివాస్‌ ఈ కథ రాశారు. బట్టతల సమస్యతో బాధపడే ఓ యువకుడి జీవితానికి సందేశం, వినోదం, ప్రేమకథను జోడిస్తూ ఆహ్లాదభరితంగా తెరపై ఆవిష్కరించారు. అందమనేది కేవలం ఓ అభిప్రాయం మాత్రమేనని, శారీరక రంగు, రూపుల్ని బట్టి ఇతరుల్ని అవహేళన చేయద్దని ఇందులో చూపించారు. మనల్ని మన యథాలాపంగా స్వీకరించుకోవడం ముఖ్యమని చెప్పారు.

తన బట్టతల సమస్య దాచిపెట్టడం కోసం జీఎస్‌ఎన్‌ పడే ఇబ్బందులతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. ఆ సన్నివేశాల్ని వినోదాత్మకంగా దర్శకుడు విద్యాసాగర్‌ మలిచారు. జీఎస్‌ఎన్‌లో మార్పుకు దారితీసే సన్నివేశాలతో ద్వితీయార్థాన్ని ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. తన సమస్యను ఎలా అధిగమించాడో హృద్యంగా చూపించారు. అనవసరపు కామెడీ ట్రాక్‌లు, డ్యూయెట్‌ల జోలికి పోకుండా కథానుగుణంగానే సందర్భోచితమైన కామెడీ రాబట్టుకునేలా స్క్రీన్‌ప్లేను అల్లుకున్న విధానం బాగుంది. అశ్లీలతకు తావు లేకుండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.

బట్టతల సమస్య కారణంగా ఆత్మన్యూనత భావంతో బాధపడే యువకుడిగా అవసరాల శ్రీనివాస్‌ చక్కటి నటనను కనబరిచారు. కామెడీ, ఎమోషన్స్‌ కలబోతగా సాగిన జీఎస్‌ఎన్‌ పాత్రలో జీవించారు. కాకినాడ యాసలో అతడు చెప్పే సంభాషణలు నవ్వుల్ని పండించాయి. గ్లామర్‌ హంగులకు దూరంగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో రుహానీశర్మ సహజ అభినయంతో ఆకట్టుకుంటుంది. హీరోలో పరివర్తనకు దారితీసే అమ్మాయిగా ఆమె పాత్ర ప్రధానంగానే ఈ కథ సాగుతుంది. రోహిణి, శివన్నారాయణ పాత్రలు ఉద్వేగభరితంగా సాగాయి.

బట్టతల సమస్యను దాచిపెట్టడం కోసం జీఎస్‌ఎన్‌ పడే ఇబ్బందుల నుంచి వినోదాన్ని రాబట్టే సన్నివేశాల్లో కొన్ని వర్కవుట్‌ కాలేదు. ద్వితీయార్థంలో కథ సాగతీసిన అనుభూతిని కలిగిస్తుంది. హీరోను ద్వేషించిన నాయికలో ఒకే ఒక్క డైలాగ్‌తో మార్పువచ్చినట్లుగా చూపించడం లాజిక్‌కు అందదు. హీరోలో పరివర్తనకు కారణమైన అంశాలు బలంగా లేవు. కాన్సెప్ట్‌ను నమ్మి దిల్‌రాజు, శిరీష్‌, దర్శకుడు క్రిష్‌ ఇలాంటి చిన్న సినిమాను నిర్మించడం అభినందనీయం. నిర్మాణ విలువలు బాగున్నాయి. హీరోగానే కాకుండా కథ, సంభాషణల రచయితగా అవసరాల శ్రీనివాస్‌ ప్రతిభను చాటుకున్నారు.
వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అయితే ఇదే తరహా కథాంశాలతో హిందీలో బాలా, కన్నడంలో ఒందు మొట్టేయ కథ సినిమాలు తెరకెక్కాయి. వాటి ఛాయలతోనే సాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.

రేటింగ్‌:2.75/5

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close