రాజకీయం

బైడెన్‌ వచ్చిన వేళ చైనా కొత్త వాదన

బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే చైనా ఒక ప్రధాన చర్య తీసుకున్నది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలోని 28 మంది అధికారులపై నిషేధం విధిస్తూ చైనా నిర్ణయం తీసుకున్నది. ఇందులో మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, మాజీ సలహాదారు జాన్ ఆర్ బోల్టన్ కూడా ఉన్నారు. చైనా-అమెరికా మధ్య సంబంధాలు క్షీణించేలా చేశారని, ఇదే సమయంలో చైనాలోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ వీరిపై ఆంక్షలు విధించినట్లు సమాచారం.

ప్రస్తుతం నిషేధానికి గురైన వీరందరూ తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుంచారని కూడా చైనా ఆరోపించింది. ఈ ఆంక్షల తరువాత, ఈ 28 మంది, వారి కుటుంబ సభ్యులు ఇకపై చైనా సరిహద్దులోకి ప్రవేశించలేరు. వారి అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థలు కూడా చైనాలో ఎలాంటి వ్యాపారాలు చేయలేవు. చైనా-అమెరికాల మధ్య సంబంధాన్ని పాడుచేయటానికి వీరంతా కుట్ర పన్నారని చైనా ఆరోపించింది. ఈ జాబితాలో పీటర్ నవారో, ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారులు రాబర్ట్ సీ ఓబ్రెయిన్, డేవిడ్ స్టిల్‌వెల్, మాథ్యూ పాటింగర్, అలెక్స్ అజార్, కీత్ క్రాచ్ట్, కెల్లీ డీకే క్రాఫ్ట్, జాన్ ఆర్ బోల్టన్, స్టీఫెన్ కే బన్నన్, మైక్‌ పాంపియో, బోల్టన్‌లతో పాటు మరికొందరు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారు భవిష్యత్‌లో చైనాతో లేదా ఏ చైనా కంపెనీతోనైనా వ్యాపారం చేయలేరని స్పష్టంచేసింది.

మరో 8 యాప్‌లపై నిషేధం

అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయే ముందు చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చైనా కంపెనీల యాజమాన్యంలోని 8 యాప్‌ల నుంచి లావాదేవీలను నిషేధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేశారు. నిషేధించిన యాప్‌లలో జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ వీచాట్ పే, అలిపే కూడా ఉన్నాయి. వాస్తవానికి, 2020 ప్రారంభంలో చైనా-యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు వాణిజ్య ఒప్పంద సంకేతంతో క్షీణించడం ప్రారంభించాయి. అంతేకాకుండా, కరోనా మహమ్మారికి చైనా బాధ్యత వహించాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ చేస్తూ చైనాను శిక్షించాలని కోరారు. చైనాలోని ముస్లింల పరిస్థితి, హాంకాంగ్ సమస్య విషయంలో కూడా చైనాపై ట్రంప్ కూడా గుర్రుగా ఉన్నారు. మరోవైపు, చైనా కూడా పలు అమెరికన్‌ కంపెనీలను తన బ్లాక్ లిస్టులో చేర్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నది. ప్రస్తుతం అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా వచ్చిన జో బైడెన్‌.. చైనా తీసుకున్న చర్యల పట్ల ఎలా స్పందిస్తారనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. బైడెన్‌ను తమ వైపు తిప్పుకోవడానికి చైనా వేస్తున్న ఎత్తులను తెలుసుకుని మసులుకుంటారా..? లేదా చైనాతో గతంలో మాదిరిగా సంబంధాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటారా..? అన్నది తేలాల్సి ఉన్నది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close