తెలంగాణ

కార్మికులనూ కనికరించని కేంద్రం

  • రైలు చార్జీలు రూపాయి కూడా తగ్గించలేదు
  • పూర్తిగా ఆరుకోట్లు చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం
  • 85 % రాయితీ ఇచ్చామన్న ప్రకటన బూటకం
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ఆగ్రహం

కరోనా కష్టకాలంలో వలస కార్మికులను గాలికొదిలేసిన కేంద్రప్రభుత్వం, వారిని రైళ్లలో తరలించేందుకు రాయితీలిచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌, కిషన్‌రెడ్డి ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నా, రైల్వేశాఖ రైలు టికెట్లలో పైసా కూడా రాయితీ ఇవ్వలేదని మంగళవారం ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చులతో కార్మికులకోసం రైళ్లను ఏర్పాటుచేయటమే కాకుండా, వారికి ఆహారం, తాగునీరు కూడా ఉచితంగా అందించి సొంతబిడ్డల్లా చూసుకుందని గుర్తుచేశారు

మానవత్వం మరిచిన కేంద్రం

వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడంలో కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మానవత్వం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాయని వినోద్‌కుమార్‌ దుయ్యబట్టారు. కార్మికులకు 85 శాతం ప్రయాణ ఖర్చులు భరిస్తున్నట్లు కేంద్రమంత్రులు చెప్పడం పచ్చి అబద్ధమని స్పష్టంచేశారు. ‘ఒక బోగీలో సాధారణంగా 72 మంది ప్రయాణించే అవకాశం ఉండగా భౌతికదూరం పాటిస్తూ 54 మందే వెళ్లాల్సి వస్తున్నది. మిగతా18 సీట్లకు రాయితీ ఇస్తున్నది. దీనికే 84 శాతం రాయితీ ఇస్తున్నామని కేంద్ర మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కష్టకాలంలో కూడా రైల్వేశాఖ పాత చార్జీలే వసూలు చేస్తున్నది. ఘట్‌కేసర్‌ నుంచి జసిద్ది జంక్షన్‌ వరకు టికెట్‌ చార్జీ రూ.675 ఉండగా, కార్మికుల కష్టాలు చూసి కూడా పైసా తగ్గించలేదు.

బీహార్‌, ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల వలస కార్మికులు మండుటెండలో కాలి నడకన సొంత ఊర్లకు వెళుతున్న భయానక, కటిక దుర్భర పరిస్థితిని చూసి బాధపడనివారు లేరు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. 6 కోట్ల చార్జీలు చెల్లించిన తెలంగాణ వలస కార్మికులను అక్కున చేర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, వారిని స్వస్థలాలకు చేర్చేందకు రైల్వేశాఖకు రూ.ఆరు కోట్లు చెల్లించిందని వినోద్‌కుమార్‌ తెలిపారు. పూర్తి చార్జీలు భరించటమే కాకుండా ప్రయాణంలో ఇబ్బంది లేకుండా భోజనం, మంచినీళ్లు కూడా అందించిందని గుర్తుచేశారు. 63 రైళ్ల ద్వారా 85,273 మంది వలస కార్మికులను వారి సొంతరాష్ట్రాలకు పంపించామని తెలిపారు. రైలు ప్రయాణ సబ్సిడీ ఇస్తున్నట్టు కేంద్ర మంత్రులు చెప్తున్న విషయం దశాబ్దాలుగా అమలులో ఉన్నదేనని స్పష్టంచేశారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close