క్రైమ్

ఇంతగా వేధిస్తారా? దిశా రవి అరెస్ట్ పై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!

  • పలుసెక్షన్ల కింద కేసు నమోదు
  • ఐదు రోజుల కస్టడీకి అనుమతి
  • తీవ్రంగా ఖండించిన పలువురు ప్రముఖులు

బెంగళూరు ఐటీ సిటీకి చెందిన 22 ఏళ్ల పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం, ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించడంపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, రచయితలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన టూల్‌ కిట్‌ను దిశా రవి అప్‌లోడ్‌ చేశారన్నది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ టూల్‌కిట్‌ రైతులను రెచ్చగొడుతోందని దిశా రవిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్, “ఇది పూర్తిగా వేధింపు చర్యే. దిశా రవికి నేను అండగా ఉంటాను. ఆమెపై వేధింపులు ఆపాల్సిందే” అని అన్నారు. ఆ వెంటనే మరో సీనియర్ నేత చిదంబరం తన ట్విట్టర్ ఖాతాలో, “దిశా రవి అరెస్ట్ ను ఖండిస్తున్నాం. ఆమె అరెస్ట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, యువత, విద్యార్థులు గళం విప్పాలి” అన్నారు. ఆమెపై అత్యంత కఠినమైన సెక్షన్లను పోలీసులు మోపారని ప్రియాంక చతుర్వేది మండిపడగా, నరేంద్ర మోదీ పాలనలో ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నారని సీతారామ్ ఏచూరి విమర్శించారు.

దిశా రవి అరెస్ట్ దురదృష్టకరమని, తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, ఆమెకు ఎటువంటి నేర చరిత్రా లేదని గుర్తు చేశారు. శశిథరూర్ సైతం దిశ అరెస్ట్ ను ఖండించారు. కాగా, గ్రెటా పోస్ట్ చేసిన టూల్ ‌కిట్‌ గూగుల్‌ డాక్యుమెంట్ ‌ను ఎడిట్‌ చేసిన వారిలో దిశ కూడా ఒకరు. రైతుల  ఆందోళనలకు తనవంతు మద్దతు తెలిపేందుకు టూల్ ‌కిట్ లోని రెండు లైన్లను మాత్రమే మార్చానని, దానిలోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నందున, తొలగించాలంటూ గ్రాటాను కోరినట్లు కూడా ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం దిశారవి ‘ఫ్రైడే ఫర్‌ ఫ్యూచర్‌’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్ ‌పట్టభద్రురాలైన ఆమె, ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తూ, సోలదేవనహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close