రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్లాల్సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు

రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్‌లాల్ సైనీ మరో వివాదానికి తెరతీశారు. మొఘల్ చక్రవర్తి హుమయూన్ తాను మరణశయ్యపై ఉండగా బాబర్‌ను పిలిచి భారత్‌ను పాలించాలనుకుంటే గోవులు, బ్రాహ్మణులు, మహిళలను గౌరవించాలని చెప్పినట్లు మదన్‌లాల్ సైనీ పేర్కొన్నారు. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్ కుమారుడు హుమయూన్ కాగా అందుకు భిన్నంగా సైనీ వ్యాఖ్యానించారు. హుమయూన్ తండ్రి బాబర్ 1531లో మరణించగా.. హుమయూన్ 1556లో తనువు చాలించారు. ఔరంగజేబు హయాంలోనూ గోవధపై నిషేధం ఉండేదన్నారు. ముస్లిం చక్రవర్తులు ఎన్నడూ గోవధను అనుమతించలేదన్నారు.
రాజస్థాన్‌లోని అల్వార్‌లో రక్బర్ ఖాన్ మూక హత్య జరిగిన నేపథ్యంలో సైనీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గోవులు, బ్రాహ్మణులు, మహిళలకు ఎలాంటి అగౌరవం జరిగినా భారత్ సహించబోదని ఆయన స్పష్టం చేశారు. రక్బర్ ఖాన్ మృతిపై సైనీ స్పందిస్తూ గతంలో ఆయనపై ఆవు స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. కాగా సైనీ వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది.
ప్రస్తుత పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చారిత్రక అవాస్తవాలను ఆయన ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ప్రధాని మోడీ సైతం చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారం ఇస్తున్న క్రమంలో సైనీ ప్రకటనలో ఆశ్చర్యం లేదని రాజస్థాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ తెలిపారు.