శ్వేతజాతి దురహంకారాన్ని ఓడిస్తాం

- అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా
- శ్వేతజాతి దురహంకారాన్ని ఓడిస్తాం
- దేశీయ ఉగ్రవాదంపై విజయం సాధిస్తాం
- భాగస్వాములతో సంబంధాల పునరుద్ధరణ
- అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రకటన
- దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
- తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల
- ప్రమాణానికి హాజరుకాని డొనాల్డ్ ట్రంప్
- బైడెన్‌కు మోదీ సహా పలువురి శుభాకాంక్షలు
- అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన
జాతి, వర్ణం, స్థానిక-స్థానికేతర అంతరాలతో విభజితమైన అమెరికా సమాజాన్ని ఐక్యం చేసి, స్వస్థత చేకూరుస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ విస్పష్టంగా ప్రకటించారు. ఐకమత్యంతోనే సవాళ్లను అధిగమించగలమని స్పష్టంచేశారు. తనకు ఓటు వేసినా, వేయకపోయినా అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని చెప్పారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ఆయన ప్రమాణం చేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘ఇది అమెరికా రోజు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. నా గెలుపుపై ఈ సంబురాలు చేసుకోవటం లేదు. ప్రజాసామ్యం గెలిచినందుకు చేసుకుంటున్నాం. ఐకమత్యంతోనే కరోనా మహమ్మారి, జాతివివక్ష వంటి సవాళ్లను అధిగమించగలం. ఐక్యతే ప్రగతికి మార్గం. అమెరికా ప్రజలు సవాళ్లకు ఎదురునిలిచి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు’ అని బైడెన్ పేర్కొన్నారు. ‘అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉన్నది. ఎన్నో సవాళ్లు అధిగమించి ఎదిగింది. ఇటీవల క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి దురదృష్టకరం. మరోసారి ఇలాంటివి పునరావృతం కావు. ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ఇది అమెరికా ప్రజలందరి విజయం. మంచి ప్రపంచంకోసం మనమందరం పాటుపడుదాం. సాధించాల్సింది చాలా ఉంది. అమెరికాను అన్ని విధాలుగా మెరుగుపరచాలి. దేశాభివృద్ధికి ప్రతి ఒక్క అమెరికన్ చేయూతనివ్వాలి. కరోనా వల్ల ఆర్థిక రంగం కుదేలైంది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి కష్టకాలంలో కలిసికట్టుగా ముందుకు సాగాలి. అని అన్నారు. ‘దేశీయ ఉగ్రవాదంపై తప్పక విజయం సాధిస్తాం. శ్వేతజాతి దురహంకారాన్ని ఓడిస్తాం. ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణం అమెరికాకే గర్వకారణం. దేశంలో సానుకూల మార్పుకు ఇదే నిదర్శనం. పరిస్థితులు మారవని చెప్పకండి. నాలుగేండ్ల ట్రంప్ పాలనలో ఇబ్బంది పడిన మిత్రదేశాలను ఆదుకుంటాం. మంచి ప్రపంచ నిర్మాణానికి మళ్లీ అమెరికా నాయకత్వం వహించేలా చేస్తాం. శాంతి, అభివృద్ధి, భద్రతకు నమ్మకమైన భాగస్వామిగా ఉంటాం. మన భాగస్వామ్య దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపరిచి. మరోసారి ప్రపంచంతో మమేకమవుతాం’ అని చెప్పారు.
ప్రమాణమిలా..
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అమెరికా పాప్ సింగర్ లేడీ గాగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. నటి, గాయకురాలు జెన్నిఫర్ లోపెజ్ కూడా ప్రదర్శన ఇచ్చారు. జో బైడెన్‌తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. బైడెన్‌కు ముందు కమలాహ్యారిస్ ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టులో తొలి లాటిన్ సభ్యురాలైన జస్టిస్ సోనియా సోటోమేయర్ ఆమెతో ప్రమాణం చేయించారు. అమెరికా తొలి మహిళా, తొలి నల్లజాతి, తొలి ఇండియన్ అమెరికన్ ఉపాధ్యక్షురాలిగా కమలాహ్యారిస్ రికార్డు సృష్టించారు. పదవి నుంచి దిగిపోతున్న డొనాల్డ్ ట్రంప్ సంప్రదాయానికి తిలోదకాలిస్తూ బైడెన్ ప్రమాణానికి హాజరు కాలేదు.
కుటుంబ బైబిల్‌పై ప్రమాణం
తన కుటుంబానికి చెందిన 127 ఏండ్ల నాటి బైబిల్‌పై బైడెన్ ప్రమాణం చేశారు. గతంలో ఉపాధ్యక్షుడిగానూ, ఏడుసార్లుగా సెనేటర్‌గా ఎన్నికైన సమయంలోనూ ఇదే బైబిల్‌పై ఆయన ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ దేశాధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జి డబ్ల్యూబుష్, బిల్ క్లింటన్ హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కాంగ్రెస్ సభ్యులు సహా మొత్తం 1000 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
డెలావర్‌కు భావోద్వేగ వీడ్కోలు
వాషింగ్టన్, జనవరి 20: ప్రమాణ స్వీకారం కోసం బైడెన్ మంగళవారం తన సొంత నగరం డెలావర్ నుంచి వాషింగ్టన్ వెళ్తూ భావోద్వేగానికి లోనయ్యారు. డెలావర్ బిడ్డను అని చెప్పుకోవడానికి తానెంతో గర్వపడతానని చెప్పారు. తన వాషింగ్టన్ ప్రయాణం 50 ఏండ్ల కిత్రం డెలావర్ నుంచే ప్రారంభమైందని కండ్ల నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు.
ముంబైలో బైడెన్ మూలాలు
బైడెన్ ముత్తాత జార్జ్ బైడెన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కెప్టెన్‌గా పనిచేశారట. ఈ విషయాన్ని బైడెనే ఒక సందర్భంలో వెల్లడించారు. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండియన్ ఇండస్ట్రీ సమాఖ్య ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఈ విషయం చెప్పారు. ‘ముంబై నగరంలో బైడెన్ పేరుతో మా తాతయ్య జార్జ్ వారసులు ఐదుగురు ఉన్నారు. మూడు దశాబ్దాల క్రితం నేను మొదటిసారి సెనెటర్‌గా ఎన్నికైన సమయంలో ముంబై నుంచి నాకు లేఖ వచ్చింది’ అని బైడెన్ వెల్లడించారు. బైడెన్ ముత్తాత జార్జ్ పదవీ విరమణ చేసిన తర్వాత భారతీయ అమ్మాయిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారు.
రెండో క్యాథలిక్ క్రిస్టియన్!
అత్యధిక వయస్సులో (78 ఏండ్లు) అధ్యక్ష పదవిని చేపట్టి రికార్డు సృష్టించిన బైడెన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన రెండో క్యాథలిక్ క్రిస్టియన్‌గా బైడెన్ చరిత్రకెక్కారు. బైడెన్ కంటే ముందు జాన్ ఎఫ్ కెన్నెడీ మాత్రమే ఏకైక క్యాథలిక్ క్రిస్టియన్ ప్రెసిడెంట్.
2 బైబిళ్లపై కమల ప్రమాణం
వాషింగ్టన్, జనవరి 20: అమెరికా 49వ వైస్ ప్రెసిడెంట్‌గా కమలాహ్యారిస్ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా కమల రెండు బైబిల్‌లపై ప్రమాణం చేశారు. ఒకటి తన ఫ్యామిలీ ఫ్రెండ్ రెజీనా షెల్టాన్ది కాగా.. రెండోది థర్గూడ్ మార్షల్‌కు చెందినది. థర్గూడ్ మార్షల్ అమెరికా సుప్రీం కోర్టు జడ్జి అయిన మొట్టమొదటి ఆఫ్రో-అమెరికన్. ప్రమాణ స్వీకారం కోసం కమలాహ్యారిస్.. నల్లజాతికి చెందిన ఇద్దరు డిజైనర్లు డిజైన్ చేసిన వస్ర్తాలను ధరించారు.
ట్రంప్ నిర్ణయాలపై బైడెన్ వేటు!
తొలిరోజే కీలక ఆదేశాలు వెలువడే అవకాశం
వాషింగ్టన్, జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 15 కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకాలు చేయనున్నట్టు శ్వేతసౌధ అధికారులు తెలిపారు. ట్రంప్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను ఉపసంహరించనున్నట్టు చెప్పారు.
వలస విధానంపై సమగ్ర బిల్లును కాంగ్రెస్ ఆమోదానికి బైడెన్ తొలిరోజే పంపనున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఇందులో ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులపై దేశాలవారీ కోటాను కూడా ఎత్తివేయనున్నారు. దీనితో వేలాది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది.
కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికన్లు 100 రోజులపాటు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా 100 రోజుల మాస్క్ చాలెంజ్‌ను బైడెన్ ప్రారంభించనున్నారు.
ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రంప్ సర్కారు విధించిన ప్రయాణ ఆంక్షలను బైడెన్ రద్దు చేయనున్నారు.
పారిస్ పర్యావరణ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరేలా బైడెన్ సంతకం చేయనున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగేలా ట్రంప్ సర్కారు తీసుకున్న చర్యలను ఉపసంహరించనున్నారు.
కొవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్ పదవిని ఏర్పాటు చేయనున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై ఈ కోఆర్డినేటర్ నేరుగా అధ్యక్షుడికి రిపోర్ట్ చేస్తారు.
పర్యావరణ సంక్షోభ నివారణ దిశగా చర్యలకు కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేయనున్నారు. ఈ అంశంలో ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించనున్నారు.
జాతివివక్షకు ముగింపు పలికేలా, సమానత్వాన్ని పాదుకొల్పేలా బైడెన్ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయనున్నారు.
జనగణన, కాంగ్రెస్ నియామకాల నుంచి నాన్ సిటిజెన్స్‌ను మినహాయించిన ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయనున్నారు.
అక్రమ వలసలను నిరోధించే పేరుతో మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్ చేపట్టిన గోడ నిర్మాణాన్ని నిలిపివేయనున్నారు.
వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా అమెరికా ప్రజల కోసమే పనిచేస్తామని ప్రతి ఉద్యోగి నైతిక విలువల ప్రతిజ్ఞ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నారు.
డ్రీమర్స్‌ను (చిన్నతనంలోనే తల్లిదండ్రులతోపాటు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినవారు) దేశం నుంచి వెళ్లగొట్టకుండా తాత్కాలిక ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించనున్నారు.
మనతో ఎలా ఉంటాడో?
భారత్-అమెరికా సంబంధాలపై బైడెన్ ప్రభావం
న్యూఢిల్లీ: బైడెన్ రాకతో భారత్, అమెరికా సంబంధాల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? అన్నది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్.. భారత్‌కు సుపరిచితుడే. ప్రస్తుతం తన టీమ్‌లో 22 మంది భారతీయులకు చోటు కల్పించారు. ఉపాధ్యక్షురాలిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్.. విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు. రక్షణ రంగంలో 2000 నుంచి భారత్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానానికే బైడెన్ కట్టుబడి ఉండే అవకాశం ఉన్నది. చైనాతో సంబంధాలపై బైడెన్ వైఖరి భిన్నంగా ఉండనుంది. చైనా విషయంలో దూకుడుగానే వ్యవహరించాలని బైడెన్ సలహాదారులు పలువురు సూచిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను విడదీయలేమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రత, సాంకేతిక రంగాల్లో భిన్న వ్యూహాలను బైడెన్ అనుసరించవచ్చు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలపై బైడెన్ ప్రభుత్వం స్పందించవచ్చు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన బైడెన్‌కు శుభాకాంక్షలు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నా
-ప్రధాని మోదీ