రాజకీయం

టీఆర్ఎస్‌కు ఓటమి భయం: బండి సంజ‌య్, విజ‌యశాంతి విమ‌ర్శ‌లు

  • నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొన్న నేత‌లు
  • కేసీఆర్ అక్ర‌మ కేసులు పెట్టిస్తున్నారు: బ‌ండి సంజ‌య్
  • ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని కేసీఆర్ మోసం చేశారు
  • న‌ల్లా నీళ్లు ఇవ్వ‌కుంటే ఓట్లు అడ‌గ‌న‌ని చెప్పారు క‌దా?:  విజ‌య‌శాంతి

తెలంగాణ‌లోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌ధాన పార్టీలు జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాయి. ఈ రోజు బీజేపీ తెలంగాణ  అధ్యక్షుడు బండి సంజయ్, మ‌హిళా నేత విజ‌యశాంతితో పాటు ప‌లువురు నాయ‌కులు సాగ‌ర్ లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇందులో భాగంగా బండి సంజ‌య్ గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామం నుంచి చెపుర్, మోససంగి, వెల్మగూడెం గ్రామాల మీదుగా రోడ్ షో నిర్వ‌హిస్తూ ప్రచారం చేశారు. త‌మ అభ్య‌ర్థి డాక్టర్ రవి కుమార్ ని గెలిపించాలని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కోరారు. టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధుల‌పై సీఎం కేసీఆర్ చ‌ర్చ‌కు సిద్ధ‌మా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాము ప్ర‌జ‌ల కోసం పోరాడుతుంటే త‌మ‌పై కేసీఆర్ అక్ర‌మ కేసులు పెట్టిస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు. మ‌ద్యం, డ‌బ్బులు పంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ గెల‌వాల‌ని చూస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

ప్ర‌చారంలో పాల్గొన్న విజ‌యశాంతి మాట్లాడుతూ… ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని చెప్పి కేసీఆర్ మోసం చేశార‌ని విమ‌ర్శించారు. ఇంటింటికీ న‌ల్లా నీళ్లు ఇవ్వ‌కుంటే మ‌ళ్లీ ఓట్లు అడ‌గ‌న‌ని చెప్పిన కేసీఆర్ ఆ ప‌ని చేయ‌కుండా మ‌ళ్లీ ఓట్లు అడుగుతున్నార‌ని విజ‌య‌శాంతి అన్నారు. తెలంగాణ‌లో భూముల కబ్జాలు పెరిగిపోయాన‌ని చెప్పారు. కేసీఆర్ పొగ‌రును అణ‌చివేయాలంటే బీజేపీకి ఓట్లు వేయాల‌ని ఆమె కోరారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close