ఆంధ్రజాతీయంటాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్స్పెషల్

హైదరాబాద్‌ బిర్యానీకి “బొంగులో” పోటీ!

బిర్యానీ అనగానే, అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్‌ బిర్యానీనే. దేశంలో ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా, హైదరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజ్ వేరనే చెప్పాలి. మసాలా ఘుమఘుమలతో చూడగానే నోరూరేలా చేస్తుంది హైదరాబాద్ బిర్యానీ. తెలుగు రాష్ట్రాలకు విదేశీ ప్రముఖులు ఎవరొచ్చినా, హైదరాబాద్ బిర్యానీని స్పెషల్‌గా తెప్పించుకుని మరీ టేస్ట్ చూస్తారు.

రాష్ట్ర విభజన తర్వాత, హైదరాబాద్ బిర్యానీకి మరింత బ్రాండింగ్ తెస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే, తెలంగాణ నుంచి విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం బిర్యానీ లోటు మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ పేరిట కూడా ఓ ప్రత్యేకమైన బిర్యానీని ఉండాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు పర్యాటక శాఖ అధికారులు బాగా శోధించిన తర్వాత, ఏజెన్సీలో పుట్టి స్టార్‌ హోటళ్ల మెనూలోకి చేరిన బొంగులో బిర్యానీనే బెస్ట్ అంటూ డిసైడ్ అయ్యారు. ఇకపై ఆంధ్రా బిర్యానీ అంటే బొంగులో బిర్యానీనే గుర్తుకు వచ్చేలా ప్రమోట్ చేయబోతున్నారు. దీన్ని విస్తృతంగా వినియోగం లోకి తేవడంతో పాటు అన్ని ప్రధాన హోటళ్లలోనూ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. దీనికోసం చెఫ్‌లకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల్లోనూ పెట్టుబడుల ఆకర్షణ కోసం స్టాళ్లు ఏర్పాటు చేస్తే, అక్కడా దీన్ని ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

బొంగులో గొడవ

బొంగులో చికెన్‌ ఏజెన్సీలో ఫేమస్‌ వంటకం. రంపచోడవరం, అరకు, బోర్రా గుహలకు వెళ్లేవాళ్లకు రోడ్డుపక్కనే బొంగులో మసాలా దట్టించిన చికెన్‌ను పెట్టి వేడి వేడిగా కాల్చి అమ్మే స్టాళ్లు చాలా కనిపిస్తాయి. దీనికే రైస్‌ను కూడా జోడిస్తే బొంగులో బిర్యానీ రెడీ అయిపోతుంది. అయితే, కొంతకాలంగా ఇలా బొంగులో వంటకాలపైనే ఆధారపడ్డ స్థానికులపై అటవీశాఖ కొరడా ఝలిపించింది. బొంగులో చికెన్‌ వంటకాల కోసం అడవిలో వెదురు చెట్లను నరికేస్తున్నారంటూ వాటిని నిషేధం విధించింది. నెలకు రెండు నుంచి మూడు వేల వరకూ డబ్బులు కడితేనే, బొంగులు నరుక్కోవడానికి అనుమతి ఇస్తామంటూ ఆంక్షలు పెట్టింది. దీంతో చాలాకాలం పాటు ఏజెన్సీలో బొంగులో చికెన్ దొరకడం లేదు.

ఇంతకాలం బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అమ్ముకుంటూ పొట్టపోసుకున్న కుటుంబాలన్నీ, అటవీ శాఖ నిర్ణయంతో ఉపాధి కోల్పోయాయి. బొంగులో చికెన్‌ను అందరికీ అలవాటు చేసిన తమకు వండే అవకాశం లేకుండా చేసి, స్టార్‌ హోటళ్లలో మాత్రం వండించడం ఏమిటంటూ మండిపడుతున్నారు ఏజెన్సీ వాసులు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close