ఆంధ్ర

‘శాశ్వత ఉచిత విద్యుత్‌’లో మరో కీలక అడుగు

  • 6 వేల మెగావాట్లకు టెండర్లు 
  • న్యాయ సమీక్షకు టెండర్‌ డాక్యుమెంట్లు 
  •  ప్రజల సూచనలు, సలహాలకు ఆహ్వానం 
  • ఆ తర్వాతే టెండర్ల ప్రక్రియ    

అమరావతి : పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించే ‘వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌’ పథకాన్ని మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ పథకం కోసమే ప్రత్యేకంగా చేపట్టిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది. తొలిదశలో.. అనంతపురం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం, కర్నూల్‌ జిల్లాల్లో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలుస్తున్నట్లు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా టెండర్‌ డాక్యుమెంట్లను న్యాయ సమీక్ష (జ్యూడీషియల్‌ ప్రివ్యూ)కు పంపింది.

ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ పర్యవేక్షణలో జరిగే టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జ్యూడీషియల్‌ ప్రీవ్యూ అధికారిక వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జ్యూడీషియల్‌ ప్రివ్యూ.ఏపీ.జీవోవీ.ఇన్‌’లో పొందుపర్చింది. వీటిని పరిశీలించి ప్రజలు, కాంట్రాక్టు సంస్థలు, నిపుణులు అవసరమైన సలహాలు, సూచనలు ఈనెల 25లోగా ‘ఏపీజ్యూడీషియల్‌ప్రీవ్యూ ఎట్‌ ది రేట్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌ లేదా ‘జడ్జి–జేపీపీ ఎట్‌ ది రేట్‌ ఏపీ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌కు పంపవచ్చని ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తెలిపింది. పీఎంయు డాట్‌ ఏపీజీఈసీఎల్‌ ఎట్‌ ది రేట్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌’కు కూడా సూచనలు పంపవచ్చని తెలిపింది. జ్యూడీషియల్‌ ప్రివ్యూ తర్వాతే పనులకు సంబంధించిన టెండర్లు పిలుస్తారని పేర్కొంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close