ఆంధ్ర

నా ఔషధానికి ఇంకా అనుమతులు రాలేదు… సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దు -ఆనందయ్య

  • విపరీతమైన పాప్యులారిటీ పొందిన ఆనందయ్య మందు
  • కృష్ణపట్నానికి పోటెత్తిన జనాలు
  • మందు పంపిణీ నిలిపివేయించిన ప్రభుత్వం
  • ఆనందయ్య మందుపై అధ్యయనం
  • శుక్రవారం నుంచి పంపిణీ అంటూ ప్రచారం
  • ఖండించిన ఆనందయ్య

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య తన ఔషధంపై జరుగుతున్న ప్రచారం పట్ల స్పందించారు. తన ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి పంపిణీ పునఃప్రారంభం అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని వివరించారు.

ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మందు పంపిణీ చేస్తానని, అయినా తనవద్ద ఇప్పుడు మూలికలు తగినంత స్థాయిలో లేవని అన్నారు. తాము ప్రకటించేవరకు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాక, తొలుత మూలికలు సేకరించుకోవాల్సి ఉందని, ఆ తర్వాతే మందు తయారీ, పంపిణీ అని వెల్లడించారు.

కరోనా ఔషధంగా పేరుపొందిన ఆనందయ్య మందుకోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా వస్తుండడంతో కృష్ణపట్నం పేరు మార్మోగిపోయింది. అయితే, ఈ మందు శాస్త్రీయతపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో, ఆయుష్ శాఖ రంగంలోకి దిగి ఆనందయ్య మందుపై అధ్యయనం చేపట్టింది. ఈ మందుపై ప్రస్తుతానికి సీసీఆర్ఏఎస్ అధ్యయనం తొలి దశ పూర్తి కాగా, దాదాపు 500 మంది నుంచి సమాచారం సేకరించి, వారు చెప్పిన సమాధానాలతో మందు గుణగణాలను పోల్చుతున్నారు.

కాగా, ఆనందయ్య మందును జంతువులపై ప్రయోగించి కీలక సమాచారం సేకరించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఆనందయ్య మందుపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని టీటీడీతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close