సినిమా

ఐశ్వర్యకు మరో బంపర్‌ ఆఫర్‌

నటి ఐశ్వర్యరాజేశ్‌కు మరో బంపర్‌ ఆఫర్‌ తలుపు తట్టిందని తెలిసింది. ఇమేజ్‌ను పక్కన పెట్టి నచ్చిన పాత్రను చేసే నటి ఈ చిన్నది. ఆదిలో కథానాయకిగా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే అభినందనలు అందుకుంది. అలా నటించిన కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్యరాజేశ్‌ జీవితాన్ని మలుపుతిప్పిందనే చెప్పాలి.ఆ తరువాత పలు హీరోయిన్‌ పాత్రల్లో నటించే అవకాశాలు వరిస్తున్నాయి. అయినా పేరు వస్తుందనిపిస్తే చెల్లెలు పాత్రలనూ వదులుకోవడం లేదు. తెలుగు ఇంటి ఆడపడుచు అని ముద్ర వేసుకున్న ఆమె ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కాలు పెట్టింది. ఇలా తమిళం, తెలుగు భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామను తాజాగా ఒక హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్ర వరించినట్లు సమాచారం.

దర్శకుడు పా.రంజిత్‌ నిర్మించనున్న తాజా చిత్రంలో ఐశ్వర్యరాజేశ్‌ కథానాయకిగా నటించనుందని సమాచారం. దీనికి దర్శకుడు అమీర్‌ శిష్యుడు సతీష్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఐశ్వర్యరాజేశ్‌ ఇప్పటికే కనా అనే క్రికెట్‌ క్రీడా నేపథ్యంలో సాగే హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించి సక్సెస్‌ను అందుకుందన్నది తెలిసిందే. తాజాగా మరోసారి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందన్నమాట.

ప్రస్తుతం తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు టక్‌ జగదీశ్‌ అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. ఇకపోతే ఆమె నటించిన ధ్రువనక్షత్రం, ఇదం పొరుల్‌ యావెల్‌ చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కావలసి ఉంది. కాగా ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాజేశ్‌ ఇప్పుడు దాన్ని బ్రేక్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనిపిస్తోంది. కారణం ఇటీవల ఈ అమ్మడు తీసుకున్న గ్లామర్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close