తెలంగాణ

చేనేతకు 73 కోట్లు విడుదల

  • ఆ రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాం
  • కార్మికుల నెలవారీ ఆదాయం రూ.15 వేలు మించింది
  • చేనేతపై సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్‌ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్‌ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్‌ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్‌ క్రెడిట్‌ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల ద్వారా చేనేత కార్మికుల ఆదాయం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం నేతన్నల నెలవారీ ఆదాయం రూ.15 వేలకు మించిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన చేనేత సంక్షేమ పథకాల వల్ల ఆ రంగంలోని కార్మికులు, అనుబంధ కార్మికుల ఆదాయాలు పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు. తాజాగా విడుదలచేసిన నిధులతో చేనేత కార్మికులకు ఏడాదంతా పని దొరుకుతుందని చెప్పారు. సమావేశంలో చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌తోపాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిధుల విడుదలపై హర్షం
చేనేత పథకాలకు నిధుల విడుదలపై మాజీ మంత్రి ఎల్‌ రమణ, టీఆర్‌ఎస్‌ నాయకులు కర్నాటి విద్యాసాగర్‌, యర్రమాద వెంకన్న నేత తదితరులు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వ పథకాలమూలంగా గతంలో వలస వెళ్లిన అనేకమంది నేత కార్మికులు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. బీటెక్‌, ఎంటెక్‌ వంటి కోర్సులు చదివిన యువత సైతం చేనేతరంగంలో ఉపాధి వెతుక్కోవడం గొప్ప మార్పని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చేనేత సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close