కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి నివాస స్థలం అప్పగింత

హైదరాబాద్ : గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలిచింది. సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు నివాస స్థలం, సంతోష్ భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.
ఈ మేరకు సంతోష్ భార్యకు ఇప్పటికే ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఇవాళ ఆమెకు నివాస స్థలం అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో కేబీఆర్ పార్క్‌కు ఎదురుగా ఉన్న రూ. 20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి కేటాయించారు. బుధవారం ఉదయం ఆ స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్ భార్యకు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
షేక్‌పేట మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం సూచించింది. సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్‌లోని 711 గజాల స్థలాన్ని కేటాయించారు.
జూన్ 22వ తేదీన సంతోష్ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లల కోసం సంతోష్ భార్య సంతోషికి ఆమె పేరిట రూ.4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందించారు. గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఇల్లుజాగ పత్రాన్ని కూడా ఇచ్చారు. సంతోష్ తల్లిదండ్రులకు కోటిరూపాయల చెక్కును సీఎం అందించారు.
