క్రైమ్

లేటు వయసులో ఏడో పెళ్లికి రెడీ అయ్యాడు..

సూరత్‌: సకల రోగాలతో సతమవుతూనే 63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ ధనిక రైతు. తన కంటే వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఆరో భార్య అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తుందన్న కారణంగా అతను మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ వితంతువును ఆరో వివాహం చేసుకున్న అతను..కరోనా కారణంగా ఆమె దూరం పెట్టడంతో డిసెంబర్‌ నెలలో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. తనకు గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్‌, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయని, తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని, అందుకే తను మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన్నది అతని వాదన. 

ఈ విషయంపై ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతని లీలలు వెలుగు చూశాయి. ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితోనూ ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఎరగా చూపి వివాహం చేసుకొని, వాడుకొని వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన గత వివాహాల గురించి తన వద్ద దాచి పెట్టి వివాహం చేసుకున్నాడని, పెళ్లి సందర్భంగా తనకు ఇస్తానన్న నగదు, ఇళ్లు కూడా ఇవ్వలేదని బాధిత మహిళ ఆరోపించింది. కాగా, అతని మొదటి భార్య.. 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయస్కులైన తన సంతానంతో కలిసి అదే గ్రామంలో ఉంటుందన్న విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిపై 498-A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ అచార వ్యవహారాల్లో ఇలా వివాహాలు చేసుకోవడం రివాజేనని నిందితుడు వాదించడం కొసమెరుపు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close