దళితుల జీవితాలను మారుస్తానన్న సీఎం చంద్రబాబు

దళితులు ఆత్మాభిమానంతో జీవించేలా కృషి చేయాలని, దళితుల్లో సమర్థవంతమైన నాయకత్వం తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరులో జరిగిన ‘దళితతేజం-తెలుగుదేశం’ ముగింపు సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజన్నారు. దళిత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దళితుల సంక్షేమం కోసం ‘దళితతేజం – తెలుగుదేశం’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దళితుల్లో ఐకమత్యం, స్ఫూర్తి వస్తుందన్నారు చంద్రబాబు. దళితుల్లో సమర్థవంతమైన నాయకత్వం రావాలని, దళితులు అన్ని రంగాల్లో పైకొచ్చే వరకు అండగా ఉంటానని, అంబేద్కర్ ఆశయసాధన కోసం అందరు కృషి చేయాలన్నారు.
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు సీఎం చంద్రబాబు. పేదల కోసం కిలో రూపాయి బియ్యం ప్రవేశపెట్టామని, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఇస్తున్నామని తెలిపారు. నూటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు ఇప్పించామన్నారు. ప్రతి ఇంటికి పెద్ద కుమారుడిలా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన నెలకు రూ. 1000 పింఛన్లు, చంద్రన్న పెళ్లికానుక ఇస్తున్నామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల వారికి 75యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. దళితుల సంక్షేమం కోసం ఈ ఏడాది రూ. 11,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తున్నామని దీంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. గురుకులాల పాఠశాలల సంఖ్య పెంచామని తెలిపారు. దళితులంతా తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇప్పిస్తున్నామని, నరేగా కింద రోజుకు రూ. 200 ఉపాధి కలిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గ్రామదర్శినిలో దళిత గ్రామాలను చాలా ఆనందపడ్డానన్నారు చంద్రబాబు. అన్ని దళిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
దళితులపై దాడులకు సంబంధించి రాష్ట్రపతిని కలిసి నిరసన వ్యక్తం చేశామన్నారు సీఎం చంద్రబాబు. దళితులపై జరిగే దాడులు నివారించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు దళితులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్‌పై చర్చ జరుగుతుండగా వైఎస్ జగన్ సభను బహిష్కరించి వెళ్లిపోయారన్నారు. దళితులకు ద్రోహం చేసేలా ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ దాసోహమయ్యారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. టీడీపీ హయాంలోనే ఎస్సీల హక్కులు కాపాడబడుతున్నాయని తెలిపారు. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే నా ధ్యేయమన్నారు చంద్రబాబు.
దళితతేజం కార్యక్రమం నిరంతరం కొనసాగాలన్నారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో దళితమిత్ర కార్యక్రమం తీసుకొస్తాంమని, భవిష్యత్‌లో దళితులు ఇళ్లు నిర్మించుకునేందుకు గాను రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. దళితులకు రాబోయే రోజుల్లో 75 యూనిట్ల నుంచి 100 యూనిట్లు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇంటిస్థలం ఇప్పించేలా చూస్తామని, దళితులంతా టీడీపీకి అండగా నిలబడాలన్నారు. అంబేద్కర్, జగ్జీవన్ భవనాల నిర్మాణాలకు రూ. 150 కోట్లు, నూతన హాస్టళ్ల కోసం రూ. 120 కోట్లు, తాగునీటికి రూ. 250 కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు తెలిపారు. లిడ్‌క్యాప్ ద్వారా చర్మకార వృత్తిదారులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు.