జాతీయం

ఘాటెక్కుతున్న ఉల్లి ధరలు

ఉల్లిని కోయకముందే కళ్లల్లో నీరు కారుతోంది. ఉల్లి ధరల ఘాటు నషాలానికి అంటుతోంది. కిలో ఉల్లి రూ. 100 మార్కును తాకుతుండటంతో సామాన్యుడు ఉల్లి జోలికి వెళ్లాలంటేనే జంకుతున్నాడు. అలా అని కూరలో ఉల్లి లేకపోతే ఆ రుచి ఉండదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఉల్లిని కొనాల్సి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. పెరుగుతున్న ఉల్లి ధరల ప్రభావం ఇటు రెస్టారెంట్లపై కూడా పడింది. నాన్‌వెజ్ ఆర్డర్ ఇచ్చిన వారికి ఉల్లిపాయలను రెస్టారెంట్లు సర్వ్ చేయకపోవడంతో నాన్ వెజ్ ప్రియులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

రెస్టారెంట్ల పై ఉల్లి ధరల ప్రభావం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఇప్పుడు ఉల్లి లేకుండా ఆ తల్లి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కారణం ఉల్లి ధరలు కొండెక్కి కూర్చోవడమే. రోజురోజుకూ ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో సామాన్యులు దాని జోలికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఉల్లి కొనే బదులు హోటల్‌ నుంచి తెచ్చుకోవడం మేలు అని చెబుతున్నారు. కానీ ఉల్లి ధరలు రెస్టారెంట్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉల్లి ధరలు పెరగడంతో రెస్టారెంట్ యాజమాన్యాలు కూడా ఉల్లిపాయలను ఇవ్వడం మానేశాయి. ఒక వేళ ఉల్లిపాయలు కావాలంటే రూ. 15 అదనంగా చెల్లించాలని చెబుతున్నాయి. అంతలా ఉల్లి ఘాటెక్కిస్తోంది.

బిజినెస్ డల్‌గా మారిందంటున్న హోటల్స్ యాజమాన్యాలు ఉల్లిపాయలు అమాంతం కొండెక్కి కూర్చోవడంతో వారి బిజినెస్ కూడా డల్‌గా మారిందని రెస్టారెంట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇక వేరే ఆప్షన్ లేక ఆ భారం క్రమంగా కస్టమర్లపై వేస్తున్నట్లు చెబుతున్నారు. నగరాలు, పట్టణాల్లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 పలుకుతుండగా కొన్ని చోట్ల ఏకంగా రూ. 100గా ఉంది. దీంతో రెస్టారెంట్లు తమ వంటకాల్లో ఉల్లిని చాలా పొదుపుగా వాడుతున్నాయి. దీంతో రుచి తగ్గడంతో కొందరు కస్టమర్లు రెస్టారెంట్లకు రావడం మానేస్తుండటంతో వారి బిజినెస్ డల్‌గా మారిందని వాపోతున్నాయి యాజమాన్యాలు.

రూ.15 చెల్లించాలంటూ దర్శనమిస్తున్న బోర్డులు రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లు బిరియాని ఆర్డర్ చేస్తే ఉల్లిపాయలు తప్పనిసరిగా సర్వ్ చేస్తారు. కానీ ఉల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు ఉల్లిని సప్లయ్ చేయడం మానేస్తున్నాయి రెస్టారెంట్లు. దీంతో ఉల్లిపాయలు కావాలంటే అదనంగా రూ. 15 చెల్లించాలని రెస్టారెంట్ల బయట బోర్డులు పెడుతున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఉల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ఇవ్వరాదని భావించి ముందుగానే బోర్డులు పెడుతున్నామని యజమానులు చెబుతున్నారు. ఒకప్పుడు రోజుకు 10 కేజీల ఉల్లిపాయలను కస్టమర్లకు ఉచితంగా ఇచ్చేవాళ్లమని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు.

పాత ఉల్లి ధర కిలో రూ.125 ఉల్లి ధరలు పెరగడంతో రెస్టారెంట్లలోని చాలా వరకు డిషెస్ ధరలు కూడా పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు మరో రెస్టారెంట్ యజమాని. ఉల్లి పాయలతో కూడిన వంటకాల ధరలను తప్పని పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. గతంలో హోల్‌సేల్ మార్కెట్‌ నుంచి రూ.15-రూ.20కి ఉల్లిపాయలను కొనుగోలు చేసేవారమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. కొత్త రకం ఉల్లిపాయలు కిలో రూ.80కి అమ్ముతుండగా పాత ఉల్లిపాయలను కిలో రూ.125కు అమ్ముతున్నామని ఓ కూరగాయల వ్యాపారి చెప్పాడు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close